Sports

పేకాట ఆడమని సలహాలు ఇస్తున్న బ్రెట్‌లీ

పేకాట ఆడమని సలహాలు ఇస్తున్న బ్రెట్‌లీ

యూఏఈలో జరిగే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ సందర్భంగా క్రికెటర్లు కచ్చితంగా బయో సెక్యూర్‌ బబుల్‌ నిబంధనలు పాటించి హోటళ్లలోనే ఉండాల్సి ఉంటుంది. బయటకు వెళ్లడానికి వీలుండదు. దాదాపు రెండు నెలల పాటు అలా గడపాలంటే వాళ్లకు విసుగు రావచ్చు. దాన్ని దూరం చేసుకోవడానికి ఆ సమయంలో గిటార్‌ నేర్చుకోమని, పేకాట ఆడమని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ సూచిస్తున్నాడు. ‘‘ముందుగా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం భౌతిక దూరంతో పాటు కొవిడ్‌-19 నిబంధనలన్నింటినీ ఆటగాళ్లు పాటించాలి. కాబట్టి ఏ క్రికెటర్‌ కూడా బయటకు వెళ్లి తప్పు చేస్తాడని నేననుకోవట్లేదు. వాళ్లు తమ జట్లు, అభిమానుల గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ ఐపీఎల్‌ జరగకపోతే అదో విపత్తుగా మారేది కదా. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు క్రికెట్‌ను చూడాలనుకుంటున్నారు. ఇన్ని రోజలు వాళ్లు ఆ ఆనందానికి దూరమయ్యారు. కాబట్టి ఆటగాళ్లు బబుల్‌లోనే ఉంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తారనే నమ్మకముంది. దాదాపు ఎనిమిది వారాలు లీగ్‌ జరగనుంది. దాని కోసం ఆటగాళ్లకు భారీగానే చెల్లించారు. కాబట్టి ఆ సమయాన్ని ఆస్వాదించండి. గిటార్‌ నేర్చుకోండి. నేనాడే రోజుల్లో నా హోటల్‌ గదిలో గిటార్‌ వాయించడాన్ని ఇష్టపడేవాణ్ని. నాకు బయటకు వెళ్లి గోల్ఫ్‌ ఆడాల్సిన అవసరం ఉండేది కాదు. అలాగే పేకాట ఆడండి’’ అని లీ తెలిపాడు. రాక్‌ బాండ్‌ సిక్స్‌ అండ్‌ ఔట్‌ బృందం తరపున బ్రెట్‌ లీ గిటార్‌ వాయిస్తుంటాడు. ఈ సీజన్‌ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు అనిల్‌ కుంబ్లే రూపంలో సరైన కోచ్‌ దొరికాడని, అది ట్రోఫీ గెలిస్తే చూడాలని ఉందని ఒకప్పుడు ఆ జట్టుకు ఆడిన లీ పేర్కొన్నాడు.