కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!
2.40 లక్షల క్యూసెక్కులకు పెరిగిన వరద
ఈ సీజన్ లో అత్యధిక వరద
ఈ నెలలోనే సాగర్, శ్రీశైలం నిండే అవకాశాలు
పశ్చిమ కనుమలతో పాటు కృష్ణానది ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతోంది.
శ్రీశైలం జలాశయానికి శనివారం సాయంత్రానికి 1.40 లక్షల క్యూసెక్కులకు పైగా కొనసాగిన వరద, ఆదివారానికి 2 లక్షల క్యూసెక్కులను, ఈ ఉదయం 2.40 లక్షల క్యూసెక్కులను దాటింది.
ఎగువన ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుండటంతో, ప్రాజెక్టులు పూర్తిగా నిండకపోయినా, దిగువకు నీటిని వదులుతున్నారు.
ఈ నీరంతా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు చేరుతోంది.
ఈ సీజన్ లో శ్రీశైలానికి నమోదైన అత్యధిక వరద నీరు ఇదే.
ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 40,259 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
జలాశయంలో 855.90 అడుగుల నీటి నిల్వ ఉంది.
రిజర్వాయర్ పూర్తిగా నిండాలంటే ఇంకో 121 టీఎంసీల నీరు అవసరం.
ఇదే సమయంలో నాగార్జున సాగర్ లో 559.40 అడుగులకు నీటి మట్టం చేరుకోగా, 230.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సాగర్ పూర్తిగా నిండాలంటే, మరో 82 టీఎంసీల నీరు అవసరం.
ఎగువన వర్షాలు కురుస్తూనే ఉండటంతో ఈ వరద మరింత కాలం పాటు కొనసాగుతుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు నెలలోనే డ్యాములు నిండిపోతాయని అంచనా.