ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలది ప్రత్యేక ముద్ర. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించారు. మొదట్లో ఒకే పార్టీ (కాంగ్రెస్)లో కలిసున్నారు. దాంతో యువకులుగా వున్నప్పటి నుంచీ ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది.
అయితే, తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వెళ్లాక వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్థులయ్యారు. అసెంబ్లీలోనూ.. బయటా కూడా ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ తమతమ పార్టీల విధానాలకు కట్టుబడి వున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేశారు. అభివృద్ధిలోనూ, సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ ఇద్దరూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. అయితే, పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్యా ఆ స్నేహం అలాగే కొనసాగిందని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు.
ఇంతటి చరిత్ర వున్న వీరిద్దరి స్నేహంపై ఇప్పుడు తెలుగులో ఓ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీరి స్నేహం ఎలా మొదలైంది? వీరి రాజకీయ ప్రయాణం ఎలా నడిచింది? రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా కత్తులు దూసుకున్నారు? వంటి అంశాల ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందించినట్టు తెలుస్తోంది.
ఆమధ్య ‘ఎన్టీఆర్’ బయోపిక్ ను నిర్మించిన విష్ణు ఇందూరి, తిరుమల రెడ్డి కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ దర్శకత్వం బాధ్యతలు చేబడుతున్నట్టు సమాచారం. ఇక ఇందులో వైఎస్ఆర్, సీబీఎన్ పాత్రలను ఎవరు పోషిస్తారన్నది అందరిలోనూ కుతూహలాన్ని రేపే అంశమే!