Politics

DMKతో కమల్ చెట్టాపట్టాల్

DMKతో కమల్ చెట్టాపట్టాల్

అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఆరునెలల గడువు మాత్రమే ఉంది. అందుకే అన్ని పార్టీల్లోనూ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. కొన్నిపార్టీలు ప్రత్యక్షంగా, మరికొన్ని పార్టీలు పరోక్షంగా ఎన్నికలకు సమాయుత్తం అవుతున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన అన్నాడీఎంకే ముచ్చటగా మూడోసారి విజయకేతనం ఎగురవేయడం ద్వారా హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా జార్జికోటపై జెండా ఎగురవేయాలని పట్దుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఏ కూటమికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఇంటెలిజెన్స్‌ పోలీసులు సర్వే ప్రారంభించారు. ప్రధాన రెండు కూటములు (డీఎంకే, అన్నాడీఎంకే)లకు చెందిన ప్రముఖ నేతలను కలుసుకుంటూ సమాచారాన్ని సేకరిస్తున్నారు.

అలాగే, ఎమ్మెల్యేగా గెలుపు అవకాశాలు కలిగిన నేతలు, నియోజకవర్గాల గురించి ఆరాతీస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్నాడీఎంకే, డీఎంకేలో జిల్లా కార్యదర్శులకు లేదా వారు సూచించే వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చే సంప్రదాయం ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారు, మాజీ మంత్రులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సీట్ల కోసం పట్టుదలతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్షంగా 70 వేల మంది ఐటీ విభాగంతో అడుగు ముందుకేయాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఎంపికను ప్రారంభించింది. మండలానికి 13 మంది, జిల్లాకు 14 మంది నిర్వాహకుల చొప్పున నియమించి, ఎన్నికల వేళ ప్రతిపక్షాల విమర్శలకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతివిమర్శలను సంధిస్తూ విజయానికి బాటలు వేసేందుకు సన్నద్ధం అవుతోంది. డీఎండీకే కోశాధికారి ప్రేమలత సైతం ఎన్నికల దిశగా కార్యోన్ముఖులయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను ఉత్తేజితులను చేసేందుకు ఈ నెల 25వ తేదీన జరగబోయే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ జన్మదినాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతూ వారిని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో చేరేందుకు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్‌ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని స్థాపించినప్పుడే ఢిల్లీ వెళ్లి నేరుగా కాంగ్రెస్‌ అధినేతలు సోనియాగాందీ, రాహుల్‌గాందీని కమల్‌ కలిసి వచ్చారు. కూటమికి సారధ్యం వహిస్తున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో మాటమాత్రం అనకుండా అధిష్టానం వద్దకు వెళ్లడంతో వ్యవహారం చెడింది. దీంతో కమల్‌ ఈ నెల 7వ తేదీన కరుణానిధి వర్దంతి రోజున ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించి గతంలో చేసిన పొరబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కమల్‌ చేరిక డీఎంకేకు మరింత బలం చేకూరుస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎంకే కూటమిలో మక్కల్‌ నీది మయ్యం చేరడం ఎంతవరకు సాధ్యమనే సందేహాలు నెలకొన్ని ఉన్నాయి. నటుడు రజనీకాంత్‌ పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారా.. లేక కమల్‌తో కలుస్తారా, అదే జరిగితే రాజకీయ బలాబలాల మాటేమిటని కూడా ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని సేకరిస్తోంది. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. అగ్రనేత కరుణానిధి కన్‌నుౖమూసిన తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అదే విజయాన్ని పునరావృతం చేయగలమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ ధీమాతో ఉన్నారు. ఒక్క రజనీకాంత్‌ మినహా అందరూ అసెంబ్లీ ఎన్నికలవైపు ఆశగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.