ScienceAndTech

గూగుల్ విజిటింగ్ కార్డు చేసుకుందామా?

గూగుల్ విజిటింగ్ కార్డు చేసుకుందామా?

‘నేను ఫలానా.. నా పని ఇది, నా బిజినెస్‌ ఇది’ అంటూ విజిటింగ్‌ కార్డులు తయారు చేయిస్తుంటారు. ఎవరినైనా కలిసినప్పుడు మీ వివరాలు చెప్పడానికి ఆ కార్డు ఇస్తుంటారు. అయితే ఇది డిజిటల్‌ జమానా. అన్నీ మొబైల్‌లోను, ఇంటర్నెట్‌తోనూ జరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫిజికల్‌ విజిటింగ్‌ కార్డు ఎందుకు. దానికి కూడా డిజిటల్‌గానే సిద్ధం చేసుకుంటే బాగుంటుంది కదా. దీని కోసం మీకు పెద్ద కష్టపడకుండా… గూగుల్‌ మీకు ఓ వర్చువల్‌ విజిటింగ్‌ కార్డు చేసి పెడుతుంది. పీపుల్స్‌ కార్డు పేరుతో గూగుల్‌ కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఓ సర్వీసు ప్రారంభించింది. దీనిని ఇప్పుడు భారత్‌కు తీసుకొచ్చింది. పీపుల్స్‌ కార్డు అంటే వర్చువల్‌ విజిటింగ్‌ కార్డు అని చెప్పొచ్చు. దీనిని చాలా సులభంగా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ మొబైల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇలా రూపొందించిన కార్డును కేవలం చూడటానికే వీలవుతుంది. ఎవరికీ షేర్‌ చేయలేం. అలాగే ఒక మెయిల్‌ ఐడీకి ఒక కార్డు మాత్రమే క్రియేట్‌ అవుతుంది. మొబైల్‌ నంబరు ఇవ్వకుండా కార్డును జనరేట్‌ చేయలేం. ప్రస్తుతం మన దేశంలో ఈ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చినా… క్రోమ్‌లో మాత్రమే పని చేస్తోంది. మిగిలిన బ్రౌజర్లలో దీని పని తీరు మెరుగవ్వాల్సి ఉంది. కొంతమంది పేర్లను గూగుల్‌లో వెతుకుంటే వాళ్ల పీపుల్‌ కార్డు కనిపించడం లేదు.

*** స్టెప్‌ బై స్టెప్‌ ఇలా…
* మొబైల్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌లోకి వెళ్లి మీ జీమెయిల్‌తో లాగిన్‌ అవ్వండి.
* add me to search అని టైప్‌ చేయండి. అప్పుడు Add yourself to Google Search అని ఒక బాక్స్‌ వస్తుంది.
* దిగువన ఉన్న Get Started అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.
* మీరు జీమెయిల్‌కి ఇచ్చిన మీ థంబ్‌ ఇమేజ్‌తో ఓ పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో మీ పూర్తి పేరు, ప్రాంతం, ఉద్యోగం/పని తదితర వివరాలు ఇవ్వాలి.
* పై వివరాలతో పాటు పని ప్రదేశం, విద్యార్హత, సొంత ప్రాంతం, వెబ్‌సైట్‌, సోషల్‌ ప్రొఫైల్స్‌, ఈమెయిల్‌, ఫోన్‌ నంబరు ఇవ్వాలి.
* అన్ని వివరాలు ఇచ్చాక… మీ వర్చువల్‌ కార్డు ప్రివ్యూ చూసుకునే ఆప్షన్‌ ఉంటుంది. అన్నీ పక్కగా ఉన్నాయనుకున్నాక సేవ్‌ క్లిక్‌ చేస్తే మీ పీపుల్‌ కార్డు సిద్ధమైపోతుంది.