బరువు నియంత్రణలో ఉండాలంటే సమతుల ఆహారంతోపాటూ వ్యాయామం కూడా తప్పనిసరి. వీటితో మరి కొన్ని ప్రభావమంతమైన, ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించడం వల్ల బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా!
నిద్ర: తగినంత నిద్ర ఆకలిని పెంచే హార్మోనును నియంత్రిస్తుంది. కాబట్టి రోజులో ఏడెనిమిది గంటలు ఎలాంటి అంతరాయం లేకుండా హాయిగా నిద్రపోండి. ఫలితంగా బరువు తేలిగ్గా తగ్గొచ్ఛు
నవ్వు: నవ్వడం వల్ల శరీరంలో సంతోషాన్ని కలిగించే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. దాంతో అతిగా తినడం నియంత్రణలోకి వస్తుంది.
చిన్న కంచం: పోషకాలు నిండుగా ఉన్న ఆహారాన్ని చిన్న ప్లేట్‌లో తినడం మంచిది. పెద్ద కంచంలో తింటున్నప్పుడు ఎంత తింటున్నాం అనేది అంచనా లేకుండా తింటాం. దాంతో బరువు పెరుగుతాం.
చిన్నపాటి నడక: అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఇన్ని లాభాలున్న నడకను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ప్రతిరోజూ కొద్ది సమయాన్ని నడకకు కేటాయించండి.
ధ్యానం: ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ధ్యానం ఎండోక్రైన్ పనితీరును నియంత్రిస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గిపోయి సంతోషంగా ఉండగలుగుతారు.
నృత్యం: మీకు వచ్చిన భంగిమలను సాధన చేసినా సరిపోతుంది. డాన్స్ ఆరోగ్యకరమైన హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. బరువు తగ్గడం తేలిక అవుతుంది.