కరోనా దెబ్బకు బ్రిటన్ విలవిల్లాడుతోంది. గత 11 ఏళ్లలో తొలిసారిగా ఆ దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బ్రిటన్ స్థూల దేశీయోత్పత్తి ఏకంగా 20.4శాతం మేర తగ్గిపోయింది. ‘క్లిష్ట సమయం వచ్చేసినట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి’ అని ఆర్థిక మంత్రి రిషీ సునక్ వ్యాఖ్యానించరంటేనే అక్కడి పరిస్థితి ఏస్థాయిలో దిగజారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘ఇప్పటికే వేల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు, భవిష్యత్తులో మరింత మంది జీవానోపాధి కోల్పోనున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ..మే నెలలో కొత్త చిగుళ్లు వేసిన సూచనలు కనిపించాయి. ఇక జూన్ నెలలో పరిస్థితి మరింతగా పుంజుకున్నప్పటికీ ఈ ధోరణి సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2021 చివరి త్రైమాసికంలో దేశ ఆర్థిక స్థితి కరోనా మునుపటి స్థాయి అందుకుంటుందని బ్రిటన్ కేంద్ర బ్యాంకు ఇటీవల అంచనా వేసింది. మరోవైపు.. బ్రిటన్‌ను మాద్యం కమ్మేయడంతో ప్రధాని బోరిస్ నాయకత్వం సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దేశం కరోనాను తట్టుకుని నిలబడేలా చేయడంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రిటన్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య ఐరోపా ఖండంలోనే అత్యధికమన్న విషయం తెలిసిందే.
ఆర్థిక కష్టాల్లో పీకల్లోతు కూరుకుపోయిన బ్రిటన్
Related tags :