* కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశాఖకు చెందిన విశ్రాంత జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని సూచించింది. అలాగే, వేతన బకాయిలను 12శాతం వడ్డీతో సహా రెండు నెలల్లోపు చెల్లించాలని ఆదేశించింది. కరోనా నేపథ్యలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలె జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
* ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో అగ్రగామి 100 కంపెనీల్లోకి చేరింది. మంగళవారం విడుదల చేసిన 2020 ర్యాంకుల్లో కంపెనీ 96వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో ఏ భారత కంపెనీకైనా ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం.
* 2012లో రిలయన్స్ తొలి సారిగా టాప్-100లోకి చేరింది. అపుడు కంపెనీ 99వ ర్యాంకు సాధించింది. అయితే 2016 నాటికి 215 స్థానానికి పరిమితమైంది. అప్పటి నుంచి ర్యాంకును మెరుగుపరచుకుంటూ వచ్చింది. తాజాగా 8620 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.46 లక్షల కోట్ల) ఆదాయంతో 96వ స్థానానికి చేరింది.
* ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) 34 స్థానాలు తగ్గి 151వ ర్యాంకుకు; ఓఎన్‌జీసీ 30 ర్యాంకులు కోల్పోయి 190వ స్థానానికి పరిమితమయ్యాయి.
* ఇక ఎస్‌బీఐ మాత్రం 21 స్థానాలు మెరుగుపరచుకుని 221వ ర్యాంకును సాధించింది.
* ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షావోమి రెడ్‌మీ కే సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. రెడ్‌మీ కే30 అల్ట్రా పేరుతో విడుదల చేశారు. గతంలో రెడ్‌మీ విడుదల చేసిన కే30, కే30 ప్రో, కే 30 ప్రో జూమ్ ఫోన్లకు కొనసాగింపుగా కే30 అల్ట్రాను తీసుకొస్తున్నారు. ఇందులో 7ఎన్‌ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 1000ప్లస్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 ఓఎస్‌తో కే30 అల్ట్రా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వాటిలో నాలుగు వెనక, ముందు భాగంలో ఒకటి అమర్చారు. వెనకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 119-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 13 ఎంపీ వైడ్ యాంగిల్ స్నాపర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉంటుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 20 ఎంపీ పాప్ అప్ కెమెరాను ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.
* దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు ఫార్మా, మెటల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో మన మార్కెట్లు నష్టపోయాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో దాదాపు 250 పాయింట్లకు పైగా కోల్పోయింది. తర్వాత కోలుకుని చివరికి 37.38 పాయింట్ల నష్టంతో 38,369.63 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 14.10 పాయింట్లు నష్టంతో 11,308 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.83గా ఉంది.
* పారిశ్రామికోత్పత్తి మళ్లీ నిరాశపరిచింది. తయారీ, గనులు, విద్యుదుత్పత్తి విభాగాలు డీలాపడటంతో జూన్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 16.6 శాతం క్షీణించింది. తయారీ రంగం ఉత్పత్తి 17.1 శాతం, గనుల తవ్వకం 19.8 శాతం, విద్యుదుత్పత్తి 10 శాతం చొప్పున తగ్గాయని కేంద్ర గణక, కార్యక్రమాల అమలు శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో పారిశ్రామికోత్పత్తి గణాంకాలను గతంతో పోల్చిచూడలేమని పేర్కొంది. నెలవారీగా చూస్తే మాత్రం పారిశ్రామికోత్పత్తి సూచీ కొంత మెరుగుపడింది. ఏప్రిల్ 53.6గా ఉండగా, మేలో 89.5, జూన్‌లో 107.8కు సూచీ పెరిగింది. గతేడాది జూన్‌లో పారిశ్రామికోత్పత్తి 1.3 శాతం వృద్ధి సాధించింది. ఈ ఏడాది జూన్‌లో మన్నికైన వినిమయ వస్తువులు, యంత్ర పరికరాల విభాగాలు వరుసగా 35.5 శాతం, 36.9 శాతం చొప్పున ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. వినిమయేతర వస్తువుల విభాగం మాత్రం 14 శాతం పెరిగింది. ఏప్రిల్- జూన్ వరకు చూస్తే పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు -35.9 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 3 శాతం వృద్ధి నమోదైంది.
* డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ‘సిప్రోడెక్స్’ జనరిక్ ఔషధాన్ని అమెరికా విపణిలో విడుదల చేసింది. సిప్రోఫ్లాగ్జాసిన్ 0.3%, డెక్సామెథసోన్ 0.1% కలిపిన ఔషధమే ‘సిప్రోడెక్స్’. చెవిలో ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. అమెరికాలో తాము విక్రయించే ఔషధాల శ్రేణిని విస్తరిస్తున్నామనడానికి ఈ ఔషధం నిదర్శనమని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ (నార్త్ అమెరికా జనరిక్స్) మార్క్ కికుచి అన్నారు. అమెరికాలో సిప్రొడెక్స్ ఔషధ వార్షిక అమ్మకాలు 450 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,400 కోట్ల) మేరకు నమోదవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ జనరిక్ సిప్రోడెక్స్ ఔషధం 7.5 ఎంఎల్, 10 ఎంఎల్ బాటిల్‌లో లభ్యమవుతుంది.
* కరోనా సంక్షోభం నుంచి బయటపడి మరింత మెరుగైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రచించడం కోసం ఏర్పాటైన 14 మంది అంతర్జాతీయ సీఈఓల బృందంలో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరని మహీంద్రా గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. బృందంలో ఇంకా అజయ్ బంగా(మాస్టర్ కార్డ్), అలెన్ ముర్రే(ఫార్చూన్ మీడియా), డాన్ హెండ్రిక్స్(ఇంటర్ ఫేస్), డైలన్ టేలర్(వోయజర్ స్పేస్ హోల్డింగ్స్), ఇమ్మాన్యుయేల్ ఫాబర్(డానోన్), పీక్ సిబెస్మా(డీఎస్‌ఎమ్), ఫ్రాన్స్ వాన్ హూటన్(ఫిలిప్స్), డాక్టర్ జేమ్స్ వాంగి(ఈక్విటీ బ్యాంక్), జీన్ పాల్ ఏగాన్(లారియల్), జాన్ డెంటాన్(ఐసీసీ), మైక్ డోల్(ఓమ్నికామ్-కెచమ్), రాబర్ట్ మార్కస్(నాచురా అండ్ కో), స్టీఫెన్ డీ లాకర్(బీర్స్‌డార్ఫ్)లున్నారు. 10000 కోట్ల డాలర్లకు పైగా వార్షిక ఆదాయం; 5 లక్షల స్థూల అంతర్జాతీయ సిబ్బంది ఉన్న కంపెనీల అధిపతుల బృందం ఇది. కరోనా అనంతర ఆర్థిక వ్యవస్థ ద్వారా సమాజం, ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనాలను.. ఎలా అందజేయాలనే విషయంపై వీరు ఒక కార్యాచరణ ప్రణాళిక రచించనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది.