పిల్లలు ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇలాంటప్పుడు ఏ కాస్త ఖాళీ దొరికినా…మొబైల్ పట్టుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వారిలో సృజనాత్మకత, ఆలోచించే గుణం వంటివన్నీ తగ్గిపోతాయి. అలాకాకుండా ఉండాలంటే…మీరు కాస్త సమయాన్ని వెచ్చించి వారితో గడపండి.
మొదట పిల్లల ఇష్టాలను గమనించండి. ఆ తరువాత వారి మెదడుకు పదును పెట్టేలా ఆలోచించి కొన్ని ప్రశ్నలు తయారు చేయమనండి. వాటికి సమాధానాలు వెతికేందుకు మీరూ సాయం చేయండి. వీలైతే…వాటిని ప్రయోగాత్మకంగా తెలుసుకునేలా చేయండి. అప్పుడు వారు కొత్తగా ఆలోచించగలుగుతారు.
*పత్రికల్లో పిల్లల కోసం ఉద్దేశించిన చిన్నచిన్న కామిక్ కథనాలు ప్రచురితమవుతుంటాయి. వాటిల్లోని కథలని చదివిస్తూ రంగులు వేయించండి. దానివల్ల ముద్రణ, రచనా ప్రక్రియ పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాయడం, చదవడం పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. వీలైతే వారినీ సొంతంగా ఏదైనా కథను రాయమనండి. మీ చుట్టుపక్కల జరిగే విషయాలను కాగితం మీద పెట్టమని చెప్పండి. వారు ఆయా అంశాలను ఎలా తీసుకుంటున్నారో అర్థమవుతుంది. వీలైతే వారి ఆలోచనా ధోరణిని సరిదిద్దేందుకు ఇది చక్కని సమయం అవుతుంది.
*● ఈ వయసులో ఏ భాషనైనా తేలిగ్గా నేర్చుకుంటారు పిల్లలు. అందుకే మాతృభాషని కాకుండా మరో భాషని కూడా నేర్పించే ప్రయత్నం చేయండి. దాంతో పాటు వారికి ఇష్టమైన నృత్యం, పెయింటింగ్…వంటి అభిరుచులు ఏమున్నా సరే! ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు సాయం చేయండి. ఇలా చేయడం వల్ల వారికి సమయం చక్కగా సద్వినియోగమవుతుంది.