జడ్జి కె.రామకృష్ణ వేసిన అనుబంధ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు ఆయన ఇచ్చిన పెన్‌డ్రైవ్‌లోని సంభాషణను నిజనిర్ధారణ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్‌కు బాధ్యతలు అప్పగించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని, అవసరమైతే సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సహకరించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించాలని, హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యుడు లక్ష్మీనర్సయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యంపై విచారణ సమయంలో జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. హైకోర్టు, న్యాయమూర్తులపై జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆడియో తన వద్ద ఉందని చెబుతూ ఆధారాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం పెన్ డ్రైవ్‌లో ఉన్నసంభాషణపై నిజనిర్ధారణ చేయాలని ఆదేశిస్తూ దీనిపై విచారణకు న్యాయ అధికారిని నియమించింది.
జస్టిస్ ఈశ్వరయ్య సంభాషణలపై హైకోర్టు సంచలన తీర్పు
Related tags :