Health

రష్యా టీకా పనిచేస్తుందా?

రష్యా టీకా పనిచేస్తుందా?

కొవిడ్‌-19 వైరస్‌కి విరుగుడుగా రష్యా అభివృద్ధి చేసిన టీకా సమర్థంగా పనిచేస్తే ప్రజలు అదృష్టవంతులేనని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా వ్యాఖ్యానించారు. టీకా సమర్థత, భద్రత గురించి ఇంకా ఏం తెలియదని, ఇప్పుడే వ్యాక్సిన్‌ పనితీరు గురించి చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని నిరోధించే టీకాను ప్రపంచంలోనే తొలిసారిగా తమ దేశం తయారు చేసిందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ను రష్యా సంపూర్ణంగా నిర్వహించలేదని, టీకా తయారీలో మూడో దశ ట్రయల్స్‌ ఎంతో కీలకమని మిశ్రా స్పష్టం చేశారు. ఈ దశలో ఎక్కువ మందిపై టీకాను పరీక్షించి.. వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వస్తోందో లేదో రెండు నెలలపాటు వేచి చూడాల్సి ఉందన్నారు. రష్యా భారీగా పరీక్షలు నిర్వహించినట్లు కనిపించలేదని, ఒకవేళ చేసి ఉంటే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచనవసరం లేదన్నారు. ఈ టీకా ఎంత వరకూ సురక్షితమో తెలియదని.. సాధారణంగా ఏ దేశంలోనైనా 1, 2, 3 దశల్లో విజయవంతమైతేనే దాన్ని అనుమతించాలని ఆయన వివరించారు. టీకా తయారీని వేగవంతం చేసేందుకు రష్యా కొన్ని నెలల క్రితం చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. భారతీయ ఔషధ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీకాల పురోగతికి సంబంధించిన సమాచారం ఈ నెలాఖరుకు లేదా సెప్టెంబరు మధ్య నాటికి వచ్చే అవకాశం ఉందని మిశ్రా తెలిపారు. మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. తొలి రెండు దశల ప్రయోగాల ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉంటాయని.. ఇప్పటికే చాలా టీకాలు ఈ దశలను దాటాయని, నిజమైన పరీక్ష మూడో దశలోనే ఉంటుందని మిశ్రా స్పష్టం చేశారు.