రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సీఎం కేసీఆర్ లేకుండా కేబినెట్ భేటీ జరిగింది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
తెలంగాణ చరిత్రలో తొలిసారిగా సీఎం లేకుండా కేబినెట్ మంత్రులు భేటీ అయ్యారు. బుధవారం ప్రగతి భవన్లో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై మంత్రి కేటీఆర్ సహచర కేబినెట్ మంత్రులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. 8 గంటలపాటు సుదీర్ఘంగా ఈ భేటీ సాగింది. కేసీఆర్ ఆదేశాలతో ఈ భేటీ నిర్వహించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అచ్చం కేబినెట్ మీటింగ్ తరహాలోనే ఈ సమావేశం జరగడం గమనార్హం. కేటీఆర్ ఈ సమావేశానికి నాయకత్వం వహించగా.. మంత్రులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై మంత్రులకు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలసీలను మంత్రులకు వివరించారు. సీఎం కేసీఆర్ ఆ సమయంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఉండటంతో ఆయన ఈ మీటింగ్కు హాజరు కాలేదు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సీఎం లేకుండా మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు సార్లు మాత్రమే ఇలా జరిగింది.
అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడిపై మావోయిస్టులు దాడి చేసినప్పుడు.. హోం మంత్రి దేవేందర్ గౌడ్ నాయకత్వంలో కేబినెట్ సమావేశమైంది. సీఎం రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ఆచూకీ లభ్యం కానప్పుడు రోశయ్య అధ్యక్షతన మంత్రులు సమావేశమయ్యారు.
ఈ విషయమై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. టీఆర్ఎస్ సానుభూతిపరులు కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేయాలని కోరుకుంటుంటే.. ఆ పార్టీని విమర్శించే వారు మాత్రం.. కేబినెట్ మీటింగ్ అనేది కుటుంబ వ్యవహారమా అని విమర్శలు గుప్పిస్తున్నారు.