Movies

ఉపాధి దానం

ఉపాధి దానం

దేశంలో లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత వలస కార్మికుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అందరికి తెలిసిందే. ఉన్నచోట ఉపాధి లేక.. సొంతూళ్లకు వెళ్లలేక అనేక కష్టాలు పడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం, పలువురు దాతల సహాయంతో వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో వారికి కాస్త ఊరట లభించింది. కానీ ఇప్పుడు వారి బతుకుదెరువు ఎలా? సొంతింట్లో ఉన్నా.. కుటుంబానికి పోషించుకోవడానికి పని దొరకాలి కదా..! ప్రస్తుతం వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు తనవంతుగా పరిష్కారం చూపించేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్‌ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ‌. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. పనిలేక ఎంతో మంది వలస కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన మనోజ్‌, ఆయన భార్య షబానా రజా.. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌తో చేతులు కలిపారు. ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు స్థానికంగా పని కల్పించడమే లక్ష్యంగా ‘శ్రామిక్‌ సమ్మాన్‌’ పేరుతో సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఫరీదాబాద్‌, ముంబయిలో మాస్క్‌ల తయారీ యూనిట్‌.. ఉత్తరాఖండ్‌లో శానిటైజర్స్‌, లిక్కర్‌ సోప్‌ తయారీ, మహిళలకు టైలరింగ్‌ యూనిట్స్‌ను ఏర్పాటు చేశారు. బిహార్‌ని భగల్‌పూర్‌లో ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ యూనిట్‌, హరియాణాలో వెదురు బొంగుతో వస్తువుల తయారీ యూనిట్‌ ప్రారంభించారు.