Business

టిక్‌టాక్ కోసం రిలయన్స్ ఉబలాటం

టిక్‌టాక్ కోసం రిలయన్స్ ఉబలాటం

నిషేధిత చైనా సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ కు సంబంధించి సంచలన విషయం మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆసియా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్) టిక్‌టాక్‌ను కోనుగోలు చేయనుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది.  ఈ మేరకు టిక్ టాక్ యజమాన్య సంస్థ బైట్ ‌డాన్స్ తో ప్రారంభ దశ చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. మొత్తం ఇండియా వ్యాపారాన్ని రిలయన్స్ కు విక్రయించేందుకు బైట్‌డాన్స్ సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్, ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించినట్లు తెలిసింది. రెండు కంపెనీల మధ్య జూలైలో చర్చలు ప్రారంభమైనాయనీ, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని టెక్ క్రంచ్ నివేదించింది. అయితే, ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ నిరాకరించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ నిర్ణయించిన సెప్టెంబర్ 15 గడువుకు ముందే చైనీస్ షార్ట్-వీడియో టిక్‌టాక్‌లోవాటా కొనుగోలుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చల నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కాగా కరోనా మహమ్మారి, ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జాతీయ భద్రత, డేటా గోప్యతా సమస్యలపై టిక్ టిక్ సహా చైనాకు చెందిన 58 యాప్ లను జూన్ 29 న కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.