Business

అమెజాన్‌లో ఔషధాల విక్రయం-వాణిజ్యం

అమెజాన్‌లో ఔషధాల విక్రయం-వాణిజ్యం

* కరోనా వైరస్‌, తదనంతర లాక్‌డౌన్‌ల నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఔషధ సరఫరా రంగానికి పెరుగుతున్న డిమాండ్‌ను ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తమ వ్యాపారాభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంది. భారత్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఔషధాలు, సాధారణ వైద్య పరికరాలను సరఫరా చేయనుంది. ‘అమెజాన్‌ ఫార్మసీ’ పేరుతో తాము ఆన్‌లైన్‌ ఔషధ సరఫరా చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తమ ఆన్‌లైన్‌ ఫార్మసీ సేవలను ఇప్పటికే బెంగళూరులో ప్రారంభించామని.. త్వరలోనే ఇతర నగరాలకు కూడా విస్తరించే యత్నాల్లో ఉన్నామని సంస్థ తెలిపింది.

* ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ఆకాష్, ఇషా , అనంత్ సహా కుటుంబ సభ్యులందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రణాళికలో భాగంగా ఈ కౌన్సిల్‌లో కుటుంబంలోని పెద్దలు, ముగ్గురు పిల్లలు, సలహాదారులు, సలహాదారులుగా వ్యవహరించే బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. కుటుంబం లేదా వ్యాపారాలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఈ కౌన్సిల్ ముఖ్య పాత్ర పోషించనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి వారసత్వ ప్రణాళిక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

* ఇటీవల భారత టూ వీలర్ మార్కెట్లో విడుదలైన యాక్టివా 6జీ ధరలను రూ.955 మేరకు పెంచుతున్నట్టు హోండా వెల్లడించింది. ఈ వేరియంట్ స్టాండర్డ్ మోడల్ ధర ఇకపై రూ.65,419 అని, డీలక్స్ వేరియంట్ ధర రూ. 66,919 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఈ సంవత్సరం జనవరిలో ఈ స్కూటర్ మార్కెట్లోకి రాగా, ఏప్రిల్ లో రూ.522 మేరకు ధరను పెంచిన సంస్థ, మూడు నెలలు తిరిగేసరికి మరోసారి ధరలను పెంచడం గమనార్హం. ఈ ధరల పెంపునకు కారణాన్ని సంస్థ వెల్లడించలేదు.

* ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెలతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో టాటాసన్స్‌ బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టాటాసన్స్‌కు విమానయాన రంగంలో వ్యాపారాలు ఉన్నాయి. దీనికి తోడు స్టీల్‌, ఆటోమొబైల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో కూడా మంచి పేరుంది.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో వరుసగా మూడో రోజూ నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ మొదలవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్‌ 38వేలు, నిఫ్టీ 11,200 దిగువకు వచ్చాయి.