Sports

మమ్మల్ని బతిమిలాడేవాళ్లు

మమ్మల్ని బతిమిలాడేవాళ్లు

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ టీమ్‌ఇండియా ఆటగాళ్లపై మరోసారి నోరుపారేసుకున్నాడు. బౌన్సర్లతో తమని కొట్టొద్దని, కావాలంటే ఔట్‌ చేసుకోమని టీమ్‌ఇండియా ఆటగాళ్లు తనతో అనేవారని చెప్పాడు. తాజాగా క్రికెట్‌ వ్యాఖ్యాత సవేరా పాషాతో క్రిక్‌కాస్ట్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ తన బౌలింగ్‌ గురించి గొప్పలకు పోయాడు. ఒకసారి ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా, ఒక ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ వద్దని చెప్పినా తనతో బౌలింగ్‌ వేయించుకొని గాయపడ్డాడని తెలిపాడు. ‘చీకటి పడుతుంది ఇప్పుడొద్దని చెప్పినా అతడు వినలేదు. దాంతో చేసేది లేక నేనొక బంతి విసిరాను. అది అతడి దవడకు తగిలి గాయమైంది. వెంటనే అతడు వికెట్లమీదే పడిపోయాడు. అలా పడిపోయేసరికి ఆ బ్యాట్స్‌మన్‌ చనిపోయాడని అనుకున్నా. అలాంటి ఘటనలు చాలా జరిగాయి, అవి జరిగినప్పుడల్లా అలా అవ్వాల్సింది కాదని బాధపడేవాడిని. అలాగే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ కూడా ఒకసారి నా బౌలింగ్‌తో దెబ్బ తగిలించుకున్నాడు. నన్ను కలిసినప్పుడల్లా అతడి కంటి కింద ఉండే గాయం మరకను చూపిస్తాడు’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా టెయిలెండర్లపై కామెంట్‌ చేశాడు. ‘కావాలంటే మమ్మల్ని ఔట్‌ చేసుకో.. కానీ, బంతితో విసిరి కొట్టకు. ఎందుకంటే నీ బంతులు చాలా గట్టిగా తగులుతాయి. మాకు భార్యాపిల్లలు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు చూస్తే బాధపడతారు’ అని తనతో అనేవారని చెప్పాడు. శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ కూడా అంతేనని, తాను బంతులేస్తే ఆడకుండా పక్కకు తప్పుకునేవాడని చెప్పాడు.