వివాహ వేడుకల్లో వింత ఆచారాలు
ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి ఒక అందమైన వేడుక. ముఖ్యమైన మలుపు. ఈ వివాహ సందర్భంలో ఎన్నో సంప్రదాయాల పద్ధతులు ఉంటాయి. పెళ్లి పద్ధతి మతం, ప్రాంతం, ఆచారాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లలో కొన్ని విచిత్రమైన పద్ధతులున్నాయి. కొన్ని ఆలోచన రేకెత్తించేలా నిగూఢార్థంతో ఉంటే మరికొన్ని పెళ్లిళ్లు నవ్వొచ్చేలా జరుగుతాయి.
* ఫిలిప్సీన్స్‌లో జరిగే పెళ్లిళ్లలో పావురాలను స్వేచ్ఛ జీవితానికి వదిలేయటం ముఖ్యమైన ఘట్టం. పెళ్లితంతు అవగానే రెండు తెల్లని పావురాలు గాల్లోకి వదిలేస్తారు. అంత హాయిగా జీవితం గడపమని వధూవరులకు శుభాకాంక్షలు చెబుతారు.
* ఆఫ్రికన్, అమెరికన్ల పెళ్లిళ్లలో ఒక సంప్రదాయం నవ్వు తెప్పిస్తుంది. అమ్మాయి అబ్బాయి కలిసి ఒక చీపురుకట్ట మీదుగా ముందుకు దూకుతారు. అలాచేస్తే వాళ్లిద్దరూ కొత్త జీవితం ప్రారంభించేందుకు ఒక శుభశకునంగా భావిస్తారు. అధికారికంగా వధూవరులుగా ఇక గృహప్రవేశం చేస్తారన్నమాట.
* నైజీరియాలో పెళ్లి సమయంలో వధూవరులకు మనం ఉగాది చేసుకునే షడ్రుచుల పానీయం వంటిది ఇస్తారు. ఆ పానీయంలో తీపి, పులుపు, కారం, చేదు ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు ఈ పానీయం ఒక గుర్తుగా భావిస్తారు. ఎలాంటి స్థితినైనా వధూవరులు ఒకేలాగా తీసుకోవాలని పెద్దలు ఆశీర్వదిస్తారు.
*జపాన్‌లో పెళ్లి పూర్తికాగానే ఆ జంట చేత మూడు గ్లాసుల్లో ఉండే వైన్‌ను తాగిస్తారు. అందులో ఒకటి అమ్మాయి తరఫు కుటుంబం, రెండోది అబ్బాయి తరుఫు కుటుంబం, మూడోది కొత్త దంపతులు ఏకం అయిన సందర్భం. రెండు కుటుంబాలు ఏకం అయ్యారని ప్రకటించటం ఈ పద్ధతిలో ఉన్న అర్థం.
*రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వధూవరులిద్దరూ కలిసి ఒక చెట్టు నాటుతారు. ఆ మొక్క వారి ఆనందకరమైన జీవితానికి ప్రతీక. అది ఎంత బలంగా, ఏపుగా ఎదిగితే ఆ దాంపత్యం అంత సుఖసంతోషాలతో ఉంటుందని భావిస్తారు. అలాగే అమ్మాయి పుట్టినా, ఆమె రజస్వల అయినా చెట్టు నాటిస్తారు. ప్రకృతికి మానవ జీవితంలో ఉండే విలువైన సంబంధానికి ప్రతీకగా ఈ మొక్కలు నాటే పద్ధతి ప్రవేశపెట్టారు.
*ఇటలీ పెళ్లిళ్లలో ప్రత్యేకంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో వధూవరులు ఉద్దేశపూర్వకంగా అద్దాలు పగలకొడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలయితే అంత ఆనంద పడతారు. ఆ అద్దం ఎన్ని ముక్కలుగా పగిలిందో అంత కాలం ఈ దంపతులు ఆనందంగా జీవిస్తారని నమ్ముతారు. పగిలిన అద్దం ముక్కలను లెక్కబెడుతూ సంతోషంతో నృత్యం చేస్తారు.
*ఐర్లాండ్‌లో పెళ్లయిన జంటకు తప్పనిసరిగా వెడ్డింగ్ బెల్స్ బహుకరిస్తారు. వధూవరులు దాన్ని తాము నివసించబోయే ఇంట్లో వేలాడదీస్తారు. ఏదైనా మనస్పర్థలు చోటు చేసుకుంటే ఆ గంట మోగిస్తారు. ఈ బెల్ ఇద్దరి మధ్య శాంతి నెలకొల్పుతుందని భావిస్తారు. ఈ గంట ఎప్పుడూ మోగించకూడదనే నియమం మనసులో పెట్టుకోవాలని అంటే దంపతులు ఎప్పుడూ ఏ విషయంలోనూ వాదులాడుకోగూడదని పెద్దవాళ్లు చెప్పినట్లుగా భావిస్తారు.
*జర్మనీలో ఒక తెగలో జరిగే పెళ్లిలో ఆహుతుల ముందు వధూవరులు ఒక పెద్ద కర్రను రంపంతో కోస్తారు. అది ముఖ్యమైన సంప్రదాయం. దానివల్ల జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే ఇద్దరూ కలిసి దాన్ని పరిష్కరించుకొంటాం అంటూ ఒక ప్రయాణం చేసినట్లే భావిస్తారు.
*ప్రతి వేడుకలో ఒక ఆచారం కనిపిస్తుంది. భారతదేశంలో జరిగే పెళ్లిళ్లల్లో అన్ని సాక్షి ప్రమాణం సప్తపది, వంటివి ఇద్దరూ అన్యోన్యంగా ఉండమని చెప్పే దీవెనల వంటివే. సర్వసాక్షి అయిన అగ్రిదేవుని ముందు మా దంపతులం ఎన్నటికీ విడిపోమని కలిసి అన్యోనంగా కాపురం చేస్తామని ఏడడుగులు కలిసి నడచినట్లే జీవితకాలం ఒకరికొకరు తోడునీడగా ఉంటామని ప్రమాణం చేస్తున్నట్లే కదా! ఎంత గొప్ప ఆలోచన చక్కని సంప్రదాయం జీవితకాలం కలిసి ఉంటే తోడును జీవితంలోకి ఆహ్వానించే అందమైన ఘట్టం కదా పెళ్లంటే. ఏ సంప్రదాయమైన వాళ్లని సుఖంగా ఉండమనే చెబుతుంది.
వివాహాల్లో వింత ఆచారాలు
Related tags :