Politics

మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం

మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం

నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో 74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. సమానత్వం అనే పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదన్న సీఎం .. ఎస్సీ, బీసీ, మైనారిటీలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 30లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు అందిస్తున్నాం… రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్థికసాయం చేస్తున్నామని వివరించారు. పేద పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదవకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

‘‘రాష్ట్ర విభజన ద్వారా అయిన గాయాలు మానాలన్నా, అలాంటి గాయం మరెన్నడూ తగలకుండా జాగ్రత్తపడాలన్న రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. వికేంద్రీకరణే సరైన విధానం అని నిర్ణయించి సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయరాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం. రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్‌, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతూ గత 14 నెలల పాలన సాగింది.వాహనమిత్ర, రైతు భరోసా, పింఛన్‌ కానుక, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, కాపునేస్తం, గోరుముద్ద, 30లక్షల ఇళ్ల పట్టాలు, కంటి వెలుగు, చేయూత, పాఠశాలలు, ఆసుపత్రుల్లో నాడు-నేడు.. ఇలా ఏ పథకం తీసుకున్నా పేదరికం నుంచి బయటపడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచి పుట్టినవే’’ అని సీఎం స్పష్టం చేశారు.