ScienceAndTech

టీకా వస్తే ఒక్క ఏడాది చాలు

టీకా వస్తే ఒక్క ఏడాది చాలు

వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి అన్నారు. సురక్షితమైన పద్ధతిలో వచ్చే ఏడాది ఆరంభం లేదా ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొస్తే ఆ తర్వాత ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాకు చెందిన పీబీఎస్‌ అనే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2021కి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ఏడాదిలోపు ప్రపంచం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. స్మాల్‌పాక్స్‌(అమ్మవారు)పై తప్ప చరిత్రలో ఏ మహమ్మారిపై మానవులు పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఆ వ్యాధులను ఆశించిన స్థాయిలో అదుపుచేయగలిగాం. తర్వాత అవి సాధారణ జనజీవనంపై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. అయితే కరోనా కట్టడిలో సరైన మార్గదర్శకాలు పాటించకపోయినా, సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోయినా దాని ప్రభావం మరి కొన్ని ఏళ్ల పాటు తప్పక ఉంటుంది’’ అని అన్నారు.