కొత్త కరోనా విజృంభణతో జింక్‌కు ప్రాధాన్యం పెరిగిపోయింది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది మరి. ఒక్క రోగనిరోధకశక్తి పెంపొందటానికే కాదు శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థలు పనిచేయటానికీ జింక్ తోడ్పడుతుంది. దీని కథేంటో తెలుసుకొని, జాగ్రత్త పడదాం.
* రోజుకు మగవాళ్లకు 8 మి.గ్రా., ఆడవాళ్లకు 11 మి.గ్రా. జింక్ చాలు. అయినా చాలామంది దీని లోపంతో బాధపడుతున్నవారే.
* మాంసం, చికెన్ వంటి వాటితో జింక్ ఎక్కువగా లభిస్తుంది.
* గింజపప్పులు, పప్పుల్లోనూ జింక్ ఉంటుంది గానీ స్వల్పమే. పైగా కూరగాయలు, తృణధాన్యాల్లోని ఫైటిక్ ఆమ్లం దీన్ని దెబ్బతీస్తుంది. జింక్‌తో ఫైటిక్ ఆమ్లం చర్య జరిపి జింక్ ఫైటేట్‌గా మారుస్తుంది. దీన్ని శరీరం గ్రహించుకోలేదు.
* తృణధాన్యాలు ఎక్కువగా.. మాంసాహార ప్రొటీన్ తక్కువగా తినేవారిలో జింక్ లోపం అధికం.
* తరచూ విరేచనాలు, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్, మద్యం అలవాటు, కాలేయ జబ్బు, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలూ జింక్ లోపానికి దారితీస్తాయి.
* జింక్ లోపిస్తే సంతాన సామర్థ్యమూ దెబ్బతినొచ్చు. గర్భిణుల్లో పిండం ఎదుగుదల కుంటుపడొచ్చు.
* రక్తహీనతకు ఐరన్‌తో పాటు జింక్ సైతం వాడుకోవాల్సి వస్తే 12 గంటల తేడాతో తీసుకోవాలి. కలిపి తీసుకుంటే ఇవి పనిచేయవు.
* జింక్ లోపం దుష్ప్రభావాలు నెమ్మదిగా బయటపడుతుంటాయి. దీని లోపంతో ఎదుగుదల కుంటుపడుతుంది. వెంట్రుకలు ఊడిపోవటం, గోళ్లు పెళుసుబారటం, చర్మం పొడిబారటం, ఆకలి తగ్గటం, వాసన తగ్గటం, తరచూ జలుబు రావటం, శరీర ఉష్ణోగ్రత మారిపోవటం, నిస్సత్తువ, చిరాకు వంటి సమస్యలెన్నో తలెత్తుతాయి.
* లోపాన్ని తగ్గించుకోవటానికి మాత్రలు, సిరప్‌ల రూపంలోనైతే శరీర బరువును బట్టి తీసుకోవాలి. ఒక రోజుకు పిల్లలకైతే కిలోకు 2-4 మి.గ్రా. (ఉదా: 10 కిలోల బరువున్నవారికి 20-40 మి.గ్రా.).. పెద్దవాళ్లకు కిలోకు 40 మి.గ్రా. (ఉదా: 50 కిలోల బరువున్నవారికి 2000 మి.గ్రా.) అవసరం.
జింకు ఎంత తింటే అంత బలం అన్నమాట!
Related tags :