Health

కరోనా రెండోసారి సోకే అవకాశాలపై సమీక్ష

కరోనా రెండోసారి సోకే అవకాశాలపై సమీక్ష

కరోనా రెండోసారి వస్తుందా? వస్తే ఏ స్థాయిలో ఉంటుంది? అనంతర పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అంశాల్లో ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతలేదు. అయితే….తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌ ఒక వ్యక్తిలో నెలలపాటు ఉంటున్నది గానీ (రీపాజిటివ్‌)… రెండోసారి వైరస్‌ సోకిన (రీఇన్ఫెక్షన్‌) ఉదాహరణలు లేవని తెలిపింది. కరోనా వైరస్‌ తాజా పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో ఈ నెల 13న పలు అంశాలను వెల్లడించింది. కరోనా సోకిన కొందరిలో వైరస్‌ నెలల వరకు ఉండడం వల్ల టెస్టులో పాజిటివ్‌ వస్తున్నదని, అంతేగానీ అది రెండోసారి వైరస్‌ వచ్చినట్టు కాదని తెలిపింది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తిలో వారం తర్వాత నుంచి వైరస్‌ బలహీనపడుతుందని, కొందరిలో నెల తర్వాత కూడా శరీరంలో ఉన్నా క్రియాశీలతను కోల్పోతుందని తెలిపింది. ఇలాంటి వైరస్‌ ఇతరులకు వ్యాపించదని వివరించింది. సార్స్‌ వచ్చిన వ్యక్తిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెంది మళ్లీ కొంతకాలంపాటు రాకుం డా ఉండే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. సార్స్‌ తరహాలోనే కరోనాపైనా పరిశోధనలు జరుగుతున్నాయని, వీటి ఆధారంగా అన్నింటిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొంది.