* ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్ మీ సీ12, రియల్ మీ సీ15 పేరుతో వీటిని తీసుకొస్తున్నారు. మార్కెట్లో ఉన్న బడ్జెట్ ఫోన్లకు పోటీగా కెమెరా, డిస్‌ప్లే వంటి ఫీచర్లలో కీలక మార్పులు చేశారు. అలానే రెండు ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఇస్తున్నారు.
* మెసేజింగ్ యాప్ అనగానే గుర్తొచ్చేది వాట్సాపే అయినప్పటికీ.. ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్‌ను పంపుకొనే వీలుండే యాప్ మాత్రం టెలీగ్రామే. అంతేకాదు.. వేల సంఖ్యలో సభ్యులు ఇందులో గ్రూపులు కట్టొచ్చు. అందుకే చాలామంది ఫోన్లలో ఇది అంతర్భాగమైపోయింది. దీనికీ ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తున్న టెలీగ్రామ్.. తన ఏడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీడియో కాల్స్ ఫీచర్‌ను తీసుకొస్తుట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఈ సౌలభ్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఒకరితో ఒకరు మాత్రమే మాట్లాడే వెసులుబాటు తీసుకురాగా.. భవిష్యత్‌లో గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయం కూడా తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.
* రేడియో తరంగాల(స్పెక్ట్రమ్)ను పంచుకునే పక్షంలో సంబంధిత బ్యాండ్‌పై మాత్రమే వినియోగ ఛార్జీల(ఎస్‌యూసీ)పై 0.5 శాతం చొప్పున ఇంక్రిమెంట్ రేటు వర్తిస్తుందని ట్రాయ్ స్పష్టం చేసింది. లైసెన్సు ఉన్న మొత్తం స్పెక్ట్రమ్‌కు అది వర్తించదని టెలికాం నియంత్రణాధికార సంస్థ వివరించింది. ప్రస్తుత స్పెక్ట్రమ్ భాగస్వామ్య ఒప్పందం రద్దు విషయంలో సమాచారం ఇవ్వడానికి తగిన నిష్క్రమణ నిబంధనలను మార్గదర్శకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని ట్రాయ్ సిఫారసు కూడా చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రాయ్ తీసుకొచ్చిన చర్చాపత్రం స్పందన ఆధారంగా దీన్ని సూచించింది. స్పెక్ట్రమ్‌ను పంచుకున్న పక్షంలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)పై 0.5 శాతం చొప్పున ప్రతీ లైసెన్సుపై ఎస్‌యూసీ రేటు పెరుగుతుందని జనవరిలో టెలికాం విభాగం పేర్కొన్న విషయం తెలిసిందే.
* డాక్టర్ కాపర్ బ్రాండ్ పేరుతో రాగి బాటిళ్లు, ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్న ఎంఎస్‌ఆర్ ఇండియా కొత్తగా కాపర్ ఫిల్టర్ ఎన్-95 రీ-యూజబుల్ మాస్క్‌ను ఆవిష్కరించింది. దీంతో పాటు కాపర్- కీ అనే మరొక ఉత్పత్తినీ తీసుకువచ్చింది. ఎయిర్ మెష్ క్లాత్, మాయిశ్చర్ కంట్రోల్, యాంటీ-బాక్టీరియల్ ఫినిష్, కాపర్ క్లాత్ ఫిల్టర్‌తో మాస్క్‌ను రూపొందించినట్లు ఎంఎస్‌ఆర్ ఇండియా సీఈఓ మల్లారెడ్డి తెలిపారు. అదేవిధంగా తలుపులు, ప్రెస్- బటన్లు ముట్టుకోకుండా కాపర్ కీ ఉపకరిస్తుందని వివరించారు. రాగితో తయారైన వస్తువులుకు వైరస్‌ను నిర్మూలించే శక్తి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు, అందువల్ల ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకువచ్చినట్లు తెలిపారు. రాగి మాస్క్‌కు రూ.199 ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.
* పళ్లు, కూరగాయల మీ కంటికి కనిపించకుండా ఎన్నో క్రిములు, పురుగు మందుల అవశేషాలు, మలినాలు ఉంటాయి. నీటిలో ఎంతగా కడిగినా ఇవి పూర్తిగా పోకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పళ్లు, కూరగాయలను పూర్తిగా శుభ్రం చేసే ద్రావణాన్ని (లిక్విడ్) ను ‘హెడెన్’ అనే బ్రాండు పేరుతో 200ఎంఎల్, 500ఎంఎల్ బాటళ్లలో ఈ ఉత్పత్తిని ఆవిష్కరించింది హైదరాబాద్‌కు చెందని హే టుమారో కన్సూమర్ ప్రొడక్ట్స్. క్రిములు, పురుగు మందుల అవశేషాలను ఈ ద్రావణం 99.9% వరకూ పోగొడుతుందని కంపెనీ డైరెక్టన్ అనిత నల్లపాటి తెలిపారు. ఈ ఉత్పత్తిని స్థానికంగానే తయారు చేయటం కోసం త్వరలో రూ.9 కోట్ల పెట్టుబడితో పూర్తిస్థాయి ఆటోమేటెడ్ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. హే టుమారో కన్సూమర్ ప్రొడక్ట్స్‌కు అకీరా భారతీ కార్పొరేట్ నుంచి రూ.1.5 కోట్ల పెట్టుబడి లభించింది. అదేవిధంగా 99 వెంచర్స్ అనే సంస్థ రూ.3 కోట్లు సమకూర్చింది. దీంతో తయారీ కార్యకలాపాలతో పాటు ఆర్‌అండ్‌డీ, మార్కెటింగ్- విక్రయాల విభాగాల్లో విస్తరించే సన్నాహాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
* టిక్ టాక్ మీద మన దేశంలో నిషేధం విధించాక… చాలా సంస్థలు షార్ట్ వీడియో యాప్‌లు రూపొందించడం, లేదంటే వాళ్ల యాప్‌లో షార్ట్ వీడియోలు తీసుకురావడం లాంటివి చేస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ కూడా అదే దారిలోకి వచ్చింది. అయితే కొత్త యాప్‌ను తీసుకురాకుండా… ఉన్న యాప్‌లోనే షార్ట్ వీడియో అనే ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్ ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. న్యూస్‌ఫీడ్ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్ కనిపిస్తాయి. దీని ద్వారా యూజర్స్ తక్కువ నిడివి ఉన్న వీడియోలను రూపొందించవచ్చు. వీక్షించొచ్చు కూడా. వాట్సాప్ స్టేటస్, ఫేస్‌బుక్ స్టోరీ తరహాలో మన వీడియోకి వచ్చిన వ్యూస్ ఎన్ని అనేది కూడా తెలుసుకోవచ్చు. నిజానికిది ఫేస్‌బుక్‌కు కొత్తేం కాదు… ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అని ఓ ఆప్షన్ ఉంది. దానినే పేరు మార్చి ఇక్కడకు తీసుకొచ్చారు.
* దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 477 పాయింట్లు లాభపడి, 38,528 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 11,385 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 11,400 మార్కును దాటడం విశేషం. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.75 వద్ద కొనసాగుతోంది.