తాండ్ర అనగానే వెంటనే తాటి తాండ్ర, మామిడి తాండ్ర గుర్తుకొస్తాయి. వీటిని పొరలు, పొరలుగా తీసుకుని తింటూ ఉంటే ఆ మజానే వేరు. వీటిని ఇష్టపడని వారు ఉండరు. ఇప్పుడు రకరకాల రూపాలలో, సైజులలో తాండ్ర లభిస్తోంది. ఈ రెండే కాకుండా అన్ని రకాల పండ్లతోనూ తాండ్రలు వచ్చేస్తున్నాయి. వీటిలో పోషకాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. తాండ్ర పట్టుకుంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అన్ని రకాల పండ్లలోనూ తాండ్రలు దొరుకుతున్నాయి. మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్ టైప్‌లోనే రెండు మూడు రకాల పండ్లను కలిపిన తాండ్రలు కూడా తయారుచేస్తున్నారు. ఈ తాండ్రలు అన్ని కాలాల్లోనూ దొరుకుతున్నాయి. వీటిని పండ్ల చాపలు అని కూడా అంటున్నారు. ఆంగ్లంలో ఫ్రూట్ లెదర్స్ అని కూడా పిలుస్తున్నారు.
ఈ పద్ధతి గిరిజనుల నుంచే ఇప్పటితరం వారు నేర్చుకున్నారంటారు. అడవుల్లో దొరికే రకరకాల కాయలూ ఫలాలనూ ఎండబెట్టి నిల్వ చేసుకుని వాటిని ఏడాది పొడవునా వాడుకునేవారు. మామిడికాయ ఒరుగులు కూడా ఈ కోవకే చెందుతాయి. నెమ్మదిగా పండ్ల నుండి గుజ్జును తీసి తాండ్రగా తయారు చేయడం నేర్చుకున్నారు. పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ తాండ్రలను ఏడాది పొడవునా నిల్వ ఉండేట్లు చేస్తున్నారు. జామ్‌లూ, జ్యూస్‌లూ, సాస్‌లూ, స్క్వాష్‌ల మాదిరిగానే ఇవి కూడా కొన్ని నెలలపాటు నిల్వ ఉంటాయి. మామూలుగా మామిడి తాండ్ర, మామిడి గుజ్జులో బెల్లంపాకం కలిపి వెదురుచాపల మీద పొరలుగా పోసి ఎండబెడతారు. ఈ మధ్య వాటిని ఎక్కువ మొత్తంలో తయారు చేయడానికి సౌరశక్తితో పనిచేసే డ్రయ్యర్లు వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల వాటిమీద ఎలాంటి దుమ్మూ, ధూళీలాంటివి చేరవు. ఎక్కువ నాణ్యతతో చాలాకాలం నిల్వ ఉంటాయి. ఇప్పుడు అదే పద్ధతిలో అంజీర్, ఆపిల్, అరటి, పనస, కమలా, దానిమ్మ, జామ, పైనాపిల్, సపోటా, పుచ్చ… ఇలా అన్ని రకాల పండ్లూ తాండ్రల రూపంలో తయారుచేస్తున్నారు. వీటికి అదనపు రుచి కోసం వెనీలా, అల్లం, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క లాంటి సుగంధ ద్రవ్యాలనూ కలుపుతున్నారు. సోలార్ డ్రయ్యర్ల కారణంగా వీటిలోని పోషకాలు తగ్గవు అని చెబుతున్నారు. మామిడి తాండ్రలో విటమిన్- ఎ, సి, పొటాషియం, పీచు, బీటా కెరోటిన్… వంటివి సమృద్ధిగా లభిస్తాయి. అత్తిపండ్లతో చేసేవాటిల్లో విటమిన్-ఎ తో బాటు కె, ఇ విటమిన్లూ లభిస్తాయి. చెర్రీ, రాస్బెర్రీ వంటి విదేశీ పండ్ల తాండ్రలూ మనకు దొరికేస్తున్నాయి. నేరుగా పండ్లు దొరకని సమయంలో ఈ పండ్ల తాండ్రలను చక్కగా ఆస్వాదించేయవచ్చు.
వానాకాలం తాండ్రలు తింటే…
Related tags :