* కరోనా వైరస్ వ్యాధికి టీకా త్వరగా రావాల్సిన అవసరం ఉందని, దేశ ఆర్థిక పునరుజ్జీవానికి అది ఎంతో ముఖ్యమని అకౌంటింగ్, కన్సల్టింగ్ సేవల సంస్థ అయిన పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో విశ్లేషించింది. కరోనా వైరస్ వ్యాధి వెలుగు చూడగానే ‘లాక్‌డౌన్’ విధించటం వల్ల వైద్య, ఆరోగ్య సదుపాయాలను సమాయత్తం చేయగలిగినట్లు, కరోనా పరీక్షలను పెద్దఎత్తున నిర్వహించటంతో పాటు ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం చేయటానికి వీలుకలిగినట్లు పేర్కొంది. అయినప్పటికీ టీకా ఆవిష్కరణ ఎంతో ముఖ్యం, పైగా మనదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజానీకానికి టీకా ఎలా పంపిణీ చేయాలనేది కూడా పెద్ద సవాలు- అని పీడబ్ల్యూసీ ఇండియా ఆ నివేదికలో వివరించింది. కాకపోతే టీకా వస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడింది.
* మద్రాస్ హైకోర్టులో వేదాంతకు చుక్కెదురైంది. ఆ కంపెనీకి చెందిన కాపర్ ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. తూత్తుకుడి ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యానికి నిరసనగా రెండేళ్ల క్రితం అక్కడ తీవ్రమైన ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. వీటిని అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. ఈ ప్లాంట్‌ను తిరిగి తెరవడంపై మంగళవారం వేదాంతా అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ‘‘ అభివృద్ధి విధానంలో ముందు జాగ్రత్త చర్యలు.. కాలుష్యానికి పరిహారం చెల్లింపులు జరగాలి. ఇవి ఎంత వరకు జరిగాయో తెలుస్తోంది. కర్మాగారం మూసేయాలి. దానికి శాశ్వతంగా సీల్ చేయాలి. పిటిషనర్ భారత్‌లో రాగి ఉత్పత్తి తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే హానిని ప్రస్తావిస్తున్నారు. కానీ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంలో ఏది ముఖ్యమంటే.. న్యాయస్థానాలు పర్యావరణమనే నిస్సందేహంగా చెబుతాయి’’ అని న్యాయస్థానం పేర్కొంది.
* మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ది ప్రత్యేక స్థానం. ప్రజలకు అంతర్జాలాన్ని దగ్గర చేసిన ఘనత దీనికే దక్కుతుంది. ఇప్పుడు అది కాలగర్భంలో కలిసిపోనుంది. వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని పేర్కొంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. అయితే, ఇంట్రాడే లాభాలు చివర్లో ఆవిరయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావానికి తోడు, ప్రధాన షేర్ల అండతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సెన్సెక్స్ 86.47 పాయింట్ల లాభంతో 38,614.79 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 23 పాయింట్ల లాభంతో 11,408.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.69 గా ఉంది.
* కొవిడ్-19 వ్యాప్తితో భారత్‌లో ఆన్‌లైన్ ఫార్మసీ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆన్‌లైన్ ఫార్మసీ రంగంలోకి ప్రవేశించింది. 83.03 మిలియన్ డాలర్లు (సుమారు రూ.620 కోట్లు) చెల్లించి.. ఇ-ఫార్మా సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను హస్తగతం చేసుకుంది. కాగా, మరో ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ అమెజాన్ ఆన్‌లైన్ ఫార్మసీ రంగంలోకి అడుగుపెట్టిన వారంలోగానే రిలయన్స్ ఈ కొనుగోలు జరపటం గమనార్హం.
* వివిధ పద్ధతుల ద్వారా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.11,000 కోట్లను సమీకరించడానికి వాటాదార్ల ఆమోదం లభించినట్లు ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. సోమవారం జరిగిన వర్చువల్ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్)లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ఎల్‌ఐసీ నామినీగా రాజేశ్ ఖండ్వాల్‌ను తిరిగి నియమించడానికి సైతం నిర్ణయం తీసుకున్నట్లు ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మీరా స్వరూప్, అన్షుమాన్ శర్మలను సైతం డైరెక్టర్లుగా నియమించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
* రుణాలకోసం డిజిటల్‌గా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించే పైసాబజార్.కామ్ తెలుగులో ఉచిత రుణ చరిత్ర నివేదికను అందించనుంది. తెలుగుతోపాటు మరాఠీ, కన్నడలోనూ దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఇప్పటికే హిందీలో ఇది నివేదికలను అందిస్తోంది. క్రెడిట్ స్కోరుపై రుణగ్రహీతల్లో అవగాహన పెరుగుతోంది.. దాన్ని స్థానిక భాషల్లో అందించడం ద్వారా వారికి సులభంగా అర్థమవుతుందని భావిస్తున్నట్లు పైసాబజార్.కామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నవీన్ కుక్రేజా వెల్లడించారు. రుణఖాతాల సంఖ్యలో తెలంగాణ ఆరు, ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయని ఆర్‌బీఐ నివేదికలు వెల్లడిస్తున్నాయి. రుణ గ్రహీతల్లో 42శాతం మందికే ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోరు ఉందని తమ సర్వేలో తేలిందని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్నాటకల్లో కలిపి రుణాలకు సంబంధించిన విచారణలు కొవిడ్-19కు ముందున్న స్థాయిలో 32శాతానికి చేరుకున్నాయని వివరించారు.