Health

బెజవాడలో కరోనా బీభత్సం

బెజవాడలో కరోనా బీభత్సం

విజయవాడ లో 43 శాతం మందికి సోకిన కరోనా

ఏపీలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. రోజుకు 9వేలకు పైగా కొత్త కేసులతో పాటు 80కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో నిర్వహించిన సిరో సర్వైలెన్స్ సర్వే సంచలన విషయాలు బయటకొచ్చాయి. విజయవాడతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో నిర్వహించిన 43.81శాతం మంది కరోనా వైరస్ ప్రభావానికి గురయినట్లు ఈ సర్వేలో తేలింది. విజయవాడలో ఇప్పటికే 3.3 శాతం మందికి కరోనా నిర్ధారణ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఐత మరో 40.51 శాతం మందికి కరోనా సోకి.. పోయినట్లు సిరో సర్వెలైన్స్‌లో తేలింది. వీరిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవు. రక్త నమూనాలు పరీక్షిస్తే శరీరంలో యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. శరీరంలో యాంటీ బాడీలు తయారయ్యాయంటే కరోనా సోకినట్లే లెక్క.

వైరస్‌ను ఎదుర్కొనేందుకే మన శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి.

విజయవాడలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారు ఎంత మంది ఉన్నారని తెలుసుకునేందుకు ఇటీవలే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సిరో సర్వైలెన్స్‌ను నిర్వహించింది. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన కరోనా అనుమానిత లక్షణాలు కనిపించలేదని చెప్పిన వారికి మాత్రమే పరీక్షలు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గుడిసెలు, చిన్న ఇళ్లు, అపార్టుమెంట్లు, వైరస్‌ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఎంపిక చేసిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు చెప్పారు. విజయవాడ అర్బన్‌లో 933 మంది రక్త నమూనాలను పరిశీలించగా 378 మందిలో యాంటీ బాడీలు కనిపించాయని వెల్లడించారు. ఈ లెక్కల 40.5 మందికి కరోనా సోకింది. ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందిలో 19.41శాతం మందికి వైరస్ సోకి వెళ్లిపోయిందని సిరో సర్వైలెన్స్‌లో తేలింది.

ప్రాంతం రక్త నమూనాలు యాంటీ బాడీలు ఉన్నవారి సంఖ్య

రాణిగారితోట 40 29

లంబాడిపేట 38 18

రామలింగేశ్వనగర్ 43 18

దుర్గాపురం 43 17

మధురానగర్ 32 20

గిరిపురం 33 18

ఎన్టీఆర్ కాలనీ 43 16

ఆర్ ఆర్ పేట 21 4

పటమట 13 5

కాగా, విజయవాడలో ఇప్పటి వరకు 1,80,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 6,000 మందికి వైరస్‌ సోకింది. రానున్న రోజుల్లో కేసులు తగ్గుతాయని భావిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక ఏపీలో ఇప్పటి వరకు 3,16,003 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి 2,26,372 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి రాష్ట్రంలో 2,906 మంది మరణించారు. ప్రస్తుతం 86,725 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇక టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 57,685 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 23,599 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30,19,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.