DailyDose

18కోట్ల పాన్‌కార్డులు మాయమైపోతాయి-వాణిజ్యం

18కోట్ల పాన్‌కార్డులు మాయమైపోతాయి-వాణిజ్యం

* పాన్‌ కార్డులను ఆధార్‌ కార్డుతో మార్చి 31, 2021 లోగా లింక్‌ చేసుకోవాలని ఐటీ శాఖ ఇప్పటికే పలుసార్లు గుర్తు చేసిన విషయం తెలిసిందే. ఆ విధంగా లింక్‌ చేయని సుమారు 18 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని… గడువు ముగిసేలోగా వాటిని ఆధార్ సంఖ్యతో జోడించకపోతే నిర్వీర్యం చేస్తామని ఆ శాఖ తెలిపింది. ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపేవారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు.

* కొవిడ్‌ను ఎదుర్కోవడానికి చైనా టీకా తెచ్చి సాయం చేస్తా అన్నా.. అది అందుకోవడం ప్రపంచానికి భారంగానే మారేట్లుంది. చాలా దేశాలు ప్రతి ఒక్కరికీ టీకా అందేట్లు చేయాలనే లక్ష్యంతో కొనుగోళ్లకు పోటీ పడుతున్నాయి. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు టీకా ధరలు పెనుభారం కాకుండా చూసుకొంటున్నాయి. కానీ, చైనాకు చెందిన సినోఫార్మా నిర్ణయించిన ధర చూస్తే బెదిరిపోవాల్సిందే. ఇప్పటికే మూడో దశ క్లీనికల్‌ ట్రయల్స్‌‌ మొదలుపెట్టిన ‘సినోఫార్మా’ వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

* సోషల్‌ మీడియా దిగ్గజాలైన ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, యూట్యూబ్‌లో భారీగా వినియోగదారుల వ్యక్తిగత డేటా డార్క్‌వెబ్‌లో లీకైనట్లు కామ్‌పారిటెక్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. దీని ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అత్యధికంగా 100 మిలియన్లకు పైగా డేటా రెండు విడతలగా లీకైంది. మూడోసారి టిక్‌ టాక్‌ నుంచి 42 మిలియన్లు, యూట్యూబ్‌ నుంచి 4 మిలియన్ల చొప్పున డేటా పోయింది. వీటిల్లో ఐదింట ఒకటో వంతు వినియోగదారుల ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లు , ప్రొఫైల్‌ ఫొటోలు వంటివి ఉన్నట్లు పేర్కొంది.

* ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయించడానికి భారత్‌లోని చట్టాలు అనుమతించవని పేర్కొంటూ అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌కు ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగిస్ట్స్‌ (ఏఐఓసీడీ) లేఖ రాసింది. ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయం గురించి ఇప్పటికే అనేక వివాదాలు, కేసులు ఉన్నట్లు అందులో తెలిపింది. ప్రిస్క్రిప్షన్‌ చూసిన తర్వాతే ఇవ్వాల్సిన మందులను ఆన్‌లైన్‌లో డెలివరీ చేయడం ద్వారా ఇబ్బందులు వస్తాయని పేర్కొంది. ఇటీవలే అమెజాన్‌ బెంగళూరులో ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏఐఓసీడీ ఈ లేఖను రాసినట్లు పేర్కొంది. ప్రధాని, ఇతర ఉన్నతాధికారులకూ ఈ విషయాన్ని తెలియజేసినట్లు వెల్లడించింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)లో వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వాటా విక్రయ ప్రక్రియను నిర్వహించేందుకు మర్చంట్‌ బ్యాంకర్ల నుంచి బిడ్‌లను ప్రభుత్వం ఆహ్వానించింది. సెప్టెంబరు 10లోగా మర్చంట్‌ బ్యాంకర్లు బిడ్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 87.40 శాతం వాటా ఉంది. సెబీ పబ్లిక్‌ హోల్డింగ్‌ నిబంధనల ప్రకారం.. కంపెనీలో వాటాను ప్రభుత్వం 75 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది.

* ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) నికర లాభం రూ.121 కోట్లుగా నమోదైంది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ రూ.342.08 కోట్ల నష్టాన్ని చవిచూసింది. మొత్తం ఆదాయం ఏడాది క్రితం నమోదైన రూ.5,006.46 కోట్ల నుంచి పెరిగి రూ.5,233.63 కోట్లకు చేరిందని ఐఓబీ తెలిపింది. అయితే వడ్డీ ఆదాయం రూ.4,336.39 కోట్ల నుంచి తగ్గి రూ.4,302 కోట్లకు పరిమితమైంది. కేటాయింపులు రూ.1,157.82 కోట్ల నుంచి తగ్గి రూ.969.52 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 22.53 శాతం నుంచి 13.90 శాతానికి, నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 11.04 శాతం నుంచి 5.10 శాతానికి తగ్గాయి.