‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డును గెలుచుకొని ఇతర భాషా ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆ సినిమా అనంతరం కథాంశాల ఎంపికలో ఆమె ప్రాధాన్యతలు మారిపోయాయి. మహిళా ప్రధాన ఇతివృత్తాలు, నవ్యత కలబోసిన కథల్ని ఎంచుకుంటూ సత్తాచాటుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు కీర్తిసురేష్ పౌరాణిక సీత పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..ప్రభాస్ కథానాయకుడిగా భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం నేపథ్యంలో ‘ఆది పురుష్’ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఆయనకు జోడీగా సీత పాత్రలో కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకోబోతున్నారని తెలిసింది. ఇటీవలే ఫోన్ ద్వారా ఈ చిత్ర కథాంశాన్ని కీర్తిసురేష్‌కు వినిపించాటడ దర్శకుడు ఓం రౌత్. తన పాత్ర చిత్రణ, కథలోని కొత్తదనం నచ్చడంతో ఈ సినిమాను కీర్తి సురేష్ అంగీకరించిందని చెబుతున్నారు. అయితే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చినప్పుడే ఈ విషయంలో స్పష్టత వస్తుందని అంటున్నారు. చెడుపై మంచి సాధించే విజయం నేపథ్యంలో పౌరాణిక గాథ ఆధారంగా ‘ఆది పురుష్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం 500కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.
ప్రభాస్‌కు సీతగా…
Related tags :