Sports

సారీ…మీకు ఇవ్వలేము

సారీ…మీకు ఇవ్వలేము

రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కార గ్రహీతలు సాక్షి మలిక్‌ (రెజ్లింగ్‌), మీరాబాయ్‌ చాను (వెయిట్‌ లిఫ్టింగ్‌)లకు అర్జున అవార్డులు అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. తొలిసారిగా అయిదుగురు క్రీడాకారులకు ఖేల్‌రత్న అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలను శుక్రవారం క్రీడల శాఖ ప్రకటించింది. టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌, రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనిక బాత్రా, పారాలింపియన్‌ తంగవేలు మరియప్పన్‌లు రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డులు గెలుచుకున్నారు. అర్జున అవార్డుల కోసం సెలెక్షన్‌ కమిటీ సిఫార్సు చేసిన 29 మంది నుంచి సాక్షి, మీరాబాయ్‌లను తప్పించిన క్రీడల శాఖ మిగతా వారికి పచ్చజెండా ఊపింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షికి అదే ఏడాది ఖేల్‌రత్న పురస్కారం లభించింది. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విజేత మీరాబాయ్‌కు తర్వాతి ఏడాది ఖేల్‌రత్న అవార్డు దక్కింది. అయితే సాక్షి, మీరాబాయ్‌లు ఈ ఏడాది అర్జున అవార్డుకు దరఖాస్తు చేసుకోవడం.. సెలెక్షన్‌ కమిటీ వీరి పేర్లను సిఫార్సు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనే అత్యున్నత క్రీడా పురస్కారాలు అందుకున్న నేపథ్యంలో సాక్షి, మీరాబాయ్‌లకు అర్జున అవార్డులు ఇవ్వకూడదని క్రీడల శాఖ నిర్ణయించింది. ఇక తెలుగబ్బాయి రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజు అర్జున అవార్డు సొంతం చేసుకోగా.. తెలుగమ్మాయి ఉష (బాక్సింగ్‌)కు ధ్యాన్‌చంద్‌ పురస్కారం లభించింది. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున వర్చువల్‌గా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా తొలిసారిగా వర్చువల్‌ పద్ధతిలో కార్యక్రమం నిర్వహించనున్నారు. క్రీడాకారులు తమకు దగ్గరలోని సాయ్‌ కేంద్రాల్లో అవార్డును అందుకుంటారు.