Business

ఒక శాతం పెరిగిన బంగారం ధరలు

ఒక శాతం పెరిగిన బంగారం ధరలు

పసిడి ధరలు నిన్న ఒక శాతం పెరిగాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఇంట్రాడేలో రూ.52,409 గరిష్టం, రూ.51,239 కనిష్టాన్ని తాకింది. గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ డెలివరి నిన్న సాయంత్రం 10 గ్రాములు రూ.51,242 పలికింది. బిజినెస్ టర్నోవర్ 15,534 లాట్‌లుగా ఉంది. డిసెంబర్ డెలివరి రూ.51,500 పలకగా, బిజినెస్ టర్నోవర్ 2,926 లాట్‌లుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్ట్ ట్రెడెడ్ వ్యాల్యూ వరుసగా రూ.4,161.48 కోట్లు, రూ.120.45 కోట్లుగా ఉంది. వివిధ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధరలు రూ.55,460, 22 క్యారెట్ల బంగారం రూ.50,840 పలికింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి.రూ.800 వరకు పెరిగి, రూ.68వేల సమీపానికి చేరుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి రూ.55,460, 22 క్యారెట్ల బంగారం రూ.50,840గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.55,950గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. డిసెంబర్ కామెక్స్ గోల్డ్ ఔన్స్ ధర 4.10 డాలర్లు (0.21 శాతం) తగ్గి 1,942 డాలర్లకు క్షీణించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు ఔన్స్ 1,900 డాలర్ల నుంచి 1,920 డాలర్ల మధ్య మద్దతు ధర ఉండవచ్చునని, అంతకు మించి తగ్గితే మరింతగా కుంగుబాటుకు గురయ్యే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.తక్షణ నిరోధకత 1,960 డాలర్ల నుంచి 1,980 డాలర్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గత రెండు రోజులుగా వెండి ధరలు కూడా క్షీణిస్తున్నాయి. అయితే ఔన్స్ వెండి 26.60 డాలర్లకు అటు ఇటుగా ఉంటోంది. ఈ రెండు అతి ఖరీదైన లోహాలు స్వల్పకాలంలో అస్థిరంగా ఉండే ఉండవచ్చునని చెబుతున్నారు. డాలర్ వ్యాల్యూ, కరోనా పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా-చైనా ట్రేడ్ వార్ వంటి పరిస్థితులపై పసిడి ధరలు ఆధారపడి ఉంటాయి.