DailyDose

బాబు ఆవేదన-తాజావార్తలు

బాబు ఆవేదన-తాజావార్తలు

* కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత సారథ్య సంఘం సీడబ్ల్యూసీ రేపు సమావేశం అవుతున్న వేళ ఆ పార్టీ సీనియర్‌ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. పార్టీలో మార్పులు సూచిస్తూ 23 మంది నేతలు ఈ లేఖ రాశారు. వీరిలో గులాంనంబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, శశి థరూర్‌, కపిల్‌ సిబల్‌, మనీశ్‌ తివారీ, రాజ్‌ బబ్బర్‌, పృథ్వీరాజ్ చవాన్‌ తదితరులు ఉన్నారు. స్వాతంత్ర్యం తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న పార్టీని సమర్థంగా నడిపే పూర్తి నాయకత్వం అవసరాన్ని వారు సూచించారు.

* ఖైరతాబాద్‌ గణేశుడి దర్శనానికి భక్తులెవరూ రావొద్దని ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది. ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని.. ఆన్‌లైన్‌లో www.ganapathideva.org వెబ్‌సైట్‌ ద్వారా గణేశుడ్ని దర్శించుకోవాలని కోరింది. మరోవైపు ఖైరతాబాద్‌లో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఆ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

* రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (భాజపా), జనతాదళ్‌‌ (యునైటెడ్‌), లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ)లు కలిసి పోటీ చేస్తాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన బిహార్‌ రాష్ట్ర భాజపా కార్యసమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, జేడీయూ, ఎల్‌జేపీ కలిసి పోరాడి విజయం సాధిస్తాయి. భాజపాతోపాటు కూటమి భాగస్వాములకు కూడా బలాన్ని చేకూరుస్తాం’ అని పేర్కొన్నారు.

* అమరావతి ఉద్యమం 250వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదుగా జరిగాయన్నారు. ఆందోళనకారుల బాధ వినడానికి కూడా ముందుకు రాని పాలకులు కూడా అరుదేనని వ్యాఖ్యానించారు. వేలాది మంది ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారని విమర్శించారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత 13 జిల్లాల ప్రజలపై ఉందన్నారు.

* దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఐసిస్‌ ఉగ్రవాది అబూ యూసఫ్‌ను గత రెండురోజుల క్రితం దిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ బలరాంపూర్‌లోని అతని ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు ఉండొచ్చిని పోలీసులు అనుమానించారు. దీంతో దిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అతని గ్రామాన్ని చుట్టుముట్టీ భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో యూసఫ్‌ ఇంట్లోనే భారీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కేవలం ప్రత్యర్థులనుంచే కాదు, తాజాగా సొంతగూటి నుంచి కూడా విమర్శలు మొదలయ్యాయి. డొనాల్డ్‌ ట్రంప్ క్రూరమైన, నమ్మలేని వ్యక్తి అంటూ ట్రంప్ సొంత‌ సోదరి మేరీఅన్నే బ్యారీ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని సొంత ఇంటినుంచే విమర్శలు చేసిన ఆడియో టేపుల సారాంశం బయటకు రావడం ట్రంప్‌కు తలనొప్పిగా మారాయి.

* గతేడాది వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలయ్యాక మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్‌ ఆడి జట్టులోకి వస్తాడని ఆశించినా గతవారం స్వాతంత్ర్య దినోత్సవం రోజున అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో బీసీసీఐ సరిగ్గా వ్యవహరించలేదని, అంత గొప్ప సారథికి సరైన వీడ్కోలు ఇవ్వలేదని పాకిస్థాన్‌ మాజీ కీపర్‌ సక్లైన్‌ ముస్తాక్‌ పేర్కొన్నాడు.

* బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని, అనుకున్న సమయానికే జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వర్గాలు తెలిపాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని పలు పార్టీల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈసీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీ గడువు నవంబర్‌ 29తో ముగియనుంది. దీంతో ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్‌ చివర్లో గానీ, నవంబర్‌లో గానీ ఎన్నికలు జరగనున్నాయి.

* ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 88 మంది వ్యక్తులు, సంస్థలతో కూడిన జాబితాను తయారు చేసి వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఓ పాక్‌ పత్రిక పేర్కొంది. దీనిలో భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ఉన్న నేరగాడు దావూద్‌ ఇబ్రహీం పేరు కూడా ఉంది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ తదుపరి సమావేశం దగ్గర పడుతుండటంతో ఉగ్రవాదులపై చర్యలు తీసుకోన్నట్లు చూపించడానికి పాక్‌ తొందరపడుతోంది. ఈ ఏడాది జూన్‌ 24న ఆర్థిక చర్యల కార్యదళం తొలి సమావేశం జరిగింది.

* టిక్‌టాక్‌ యాప్‌ను అమెరికాలో నిషేధించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇక కోర్టులోనే అడ్డుకుంటామని ఆ సంస్థ స్పష్టం చేసింది. ట్రంప్‌ నిర్ణయాలను సవాలు చేస్తూ త్వరలోనే కోర్టులో దావా వేయనున్నట్లు ప్రకటించింది. తమ వాదనను వినేందుకు అమెరికా పాలనా విభాగం సుముఖంగా లేకపోవడంతో దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసేందుకు సిద్ధమైనట్లు వివరించింది.