ఈమధ్య చాలామంది అన్నం తినాలంటే భయపడుతున్నారు. ఒకవేళ తిన్నా ముడి రూపంలోనే తింటున్నారు. లేదూ అన్నానికి బదులు సజ్జలు, జొన్నలు వంటి తృణ ధాన్యాలూ; రాగులు, కొర్రలు, అరికెలు… వంటి చిరుధాన్యాలకే చోటు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు వాటితోబాటు ఎలాంటి భయం లేకుండా ఎర్రబియ్యాన్నీ జోడించవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.
**బియ్యం అనగానే తెల్ల రంగు లేదా గోధుమ రంగులో ఉండే ముడిబియ్యమే గుర్తుకొస్తాయి. కానీ ఈమధ్య మార్కెట్లో ఎర్రబియ్యం కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎర్రబియ్యంలో ఉన్న అనేకానేక పోషకాల వల్ల అవి ఎన్నో వ్యాధుల్ని నివారిస్తాయని తేలింది. ఎరుపూ ఊదారంగు పండ్లూ బ్లూ బెర్రీల్లో మాదిరిగానే ఈ బియ్యంలో ఆంథోసైనిన్ల శాతం ఎక్కువ. ఆ కారణంతోనే చైనా సంప్రదాయ వైద్యంలో వీటిని ఎప్పట్నుంచో వాడుతున్నారు. ఇవి జీర్ణశక్తిని పెంచి, రక్తనాళాల్లో పూడికల్ని తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయట. అందుకే వీటిని అన్నంలా తినడంతోబాటు ఇతరత్రా వంటల్లోనూ వాడతారట. క్రీ.శ. 800కాలం నుంచీ వీటిని అక్కడ పండిస్తున్న ఆధారాలు ఉన్నాయి. అయితే వీటిని మిగిలిన బియ్యంలా కాకుండా ఒకటికి మూడు కప్పుల నీళ్లు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి, సిమ్‌లో మెత్తగా ఉడికించి తినాలి.
****రకాలూ ఉన్నాయ్!
తెల్లబియ్యంలో మాదిరిగానే ఇందులోనూ రక్తశాలి, థాయ్ రెడ్ కార్గో, భూటానీస్ రెడ్, హిమాలయన్ రెడ్, కామార్గ్యు రెడ్, కేరళ మట్టా…వంటి రకాలెన్నో ఉన్నాయి. అన్నింటిలోకీ హిమాలయన్, థాయ్ రెడ్ రకాల్లో అపిజెనిన్, మిరిసిటిన్, క్యుయెర్సిటిన్… వంటి ఆంథోసైనిన్ల శాతం ఎక్కువ. నిజానికి బుడంబియ్యం పేరుతో మనదగ్గరా ఒకప్పుడు వీటిని పండించేవారు. అయితే అప్పట్లో తక్కువ రకంగా భావించి కింది తరగతివాళ్లు మాత్రమే తినేవారు. అవి కాస్తా ఇప్పుడు ఖరీదైనవిగా మారిపోయాయి. ఈ బియ్యంలో పీచు శాతం ఎక్కువ. విటమిన్ బి1, బి2… వంటి విటమిన్లతోబాటు ఐరన్, జింక్, పొటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్… వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధులకు మందులా పనిచేస్తాయివి.
**మంచి మందు!
హృద్రోగులకీ మధుమేహ రోగులకీ ఎర్రబియ్యం ఎంతో మేలు. ఈ బియ్యంలోని పోషకాలవల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గినట్లు కొన్ని పరిశీలనల్లో తేలింది. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోనీయవు. నేషనల్ పింగ్‌టంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల పరిశీలనలో ఈ బియ్యం తినేవాళ్లలో రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలింది.
* ఎర్ర అన్నాన్ని రోజూ తినడంవల్ల అందులోని ఐరన్, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి కణాలకీ కణజాలాలకీ సరిగ్గా అందేలా చేస్తుంది. దాంతో శరీరం అలసట లేకుండా శక్తిమంతంగా ఉంటుంది. మానసిక ఉత్తేజాన్నీ కలిగిస్తుంది.
* ఎర్రబియ్యంలోని మాంగనీస్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేయడంతోబాటు ఫ్రీ- రాడికల్స్‌నూ తగ్గిస్తుంది. అలాగే జింక్‌కి గాయాన్ని మాన్పించే గుణం ఉంటుంది.
* విటమిన్-బి6 సెరటోనిన్ శాతాన్ని పెంచి ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
* ఈ బియ్యంలో ఉండే మొనాకొలిన్ గ్యాస్ట్రిక్ సమస్యల్నీ తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
* ఎర్రబియ్యం కొంచెం తినగానే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. దాంతో త్వరగా ఆకలి వేయదు. బరువూ తగ్గుతారు.
* వీటిని క్రమం తప్పకుండా తినేవాళ్లలో ఆస్తమా సమస్యలు తక్కువట.
* ఇందులోని మెగ్నీషియం వల్ల కీళ్ల సమస్యలతో బాధపడేవాళ్లు ఎర్రబియ్యం తినడం వల్ల ఫలితం ఉంటుందట. ఇది శరీరంలో ఆక్సిజన్ పెరిగేందుకూ తోడ్పడటంతో శ్వాసకోశ సమస్యల్నీ నిరోధిస్తుంది.
* వంద గ్రా. ఎర్ర బియ్యంలో 6.2 గ్రా. పీచు ఉంటుంది. ఇది అన్ని రకాల బియ్యాల్లోకెల్లా ఎక్కువ. తెల్లబియ్యంలో పిండిపదార్థాలు ఎక్కువుంటే ఎర్రబియ్యంలో పీచు ఎక్కువ. అందుకే ఈమధ్య ఆరోగ్యస్పృహ ఉన్నవాళ్లు భోజనం ప్లేటులో తెల్ల అన్నానికి బదులు ఎర్రని అన్నాన్నే కలుపుతున్నారు.
ఎర్రన్నం తిన్నారా?
Related tags :