Food

మీ గొంతునొప్పికి ఈ కషాయం ప్రయత్నించండి

మీ గొంతునొప్పికి ఈ కషాయం ప్రయత్నించండి

వర్షాకాలం మొదలవుతూనే… జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వేధిస్తుంటాయి. పరిష్కారంగా.. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయడం తప్పనిసరి. వాటితోపాటూ రోగనిరోధకతను పెంచుకోవడానికి ఇంట్లోనే ఈ కషాయం తయారుచేసుకోండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..
ఈ కషాయం తయారు చేసుకోవడానికి చిన్న అల్లంముక్క, అరచెంచా తేనె, నిమ్మకాయ, నాలుగైదు తులసి ఆకులు, చిన్న దాల్చిన చెక్క, రెండు లవంగాలు, పావు చెంచా సోంపూ తీసుకోవాలి. మొదట అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అవి మరుగుతున్న సమయంలో అల్లం ముక్కలు, తులసి ఆకులు, లవంగాలు, సోంపూ, దాల్చిన చెక్క వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరిగించాలి. దీన్ని గ్లాసులోకి వడబోసి తేనె, కొద్దిగా నిమ్మరసరం కలపాలి. ఈ కషాయాన్ని రోజులో రెండుసార్లు తాగితే .. జలుబు, దగ్గుతోపాటు గొంతునొప్పి తగ్గుతుంది.
* ఈ కషాయంలో ఉపయోగించిన పదార్థాలన్నీ యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి వైరల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
* ఈ కషాయం జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. కడుపు నొప్పి, మలబద్ధకం, కడుపులో మంట లాంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది.
* ఇది ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తీసుకోవచ్చు.