ఢిల్లీ నుంచి లండన్‌కు బస్.. టికెట్ ధర రూ. 15 లక్షలు మాత్రమే!
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఢిల్లీ నుంచి ఓ బస్సు బ్రిటన్ రాజధాని లండన్‌కు బయలుదేరబోతోంది. మొత్తం 18 దేశాల మీదుగా 70 రోజులపాటు సాగనున్న ఈ ప్రయాణంలో మొత్తం 20 వేల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగనుంది. ‘బస్ టు లండన్’ పేరుతో ప్రారంభం కానున్న ఇది మామూలు ప్రయాణం కాదు.. సాహస యాత్ర. గురుగ్రామ్‌కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ బస్ యాత్రకు శ్రీకారం చుట్టింది. టికెట్ ధరను రూ. 15 లక్షలుగా నిర్ణయించింది.
యాత్రలో భాగంగా మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ప్రయాణం సాగుతుంది. 20 మంది మాత్రమే ప్రయాణించే వీలున్న ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, సహాయకుడు ఉంటారు. ఈ బస్సులో ప్రయాణించాలనుకునే వారికి వీసా, భోజన, వసతి సదుపాయాల నుంచి అన్నింటినీ ట్రావెల్ సంస్థే చూసుకుంటుంది. నిజానికి ఈ ఏడాది మే 21నే ప్రయాణం ప్రారంభించాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది.