Sports

గంగూలీని వెళ్లగొట్టింది నేనే

గంగూలీని వెళ్లగొట్టింది నేనే

సౌరవ్‌ గంగూలీని తిరిగి తీసుకోవద్దన్నది తన నిర్ణయమేనని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సీఈవో వెంకీ మైసూర్‌ అన్నారు. ఫ్రాంచైజీ, యజమానులకు తన నిర్ణయం కఠినంగానే అనిపించిందని పేర్కొన్నారు. ఎక్కడైనా రెండు, మూడేళ్లు పనిచేశాక అవసరమైతే సమూల మార్పులు చేస్తానని తెలిపారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దాదా సారథ్యం వహించాడు. అయితే అప్పటి కోచ్‌ ముగ్గుర్ని కెప్టెన్లుగా చేద్దామని భావించాడు. ఈ నిర్ణయం ఆ జట్టును దెబ్బతీసింది. తర్వాతి ఏడాదే మరో వ్యక్తిని సారథిగా ఎంపిక చేశారు. మూడో ఏడాది మళ్లీ గంగూలీకి పగ్గాలు అప్పగించారు. అప్పటికే ఆ జట్టులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో 2011లో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కోల్‌కతాకే చెందిన గంగూలీని వదిలేశారు. దాంతో అభిమానుల్లో ఆవేశం పెరిగింది. 2011 సీజన్‌లో గంభీర్‌ నాయకత్వంలో జట్టు ప్లేఆఫ్‌ చేరుకోవడం, 2012లో ఏకంగా టైటిల్‌ గెలవడంతో మళ్లీ అభిమానం పెరిగింది. ‘నా వరకైతే అదో పెద్ద నిర్ణయం కాదు. ఎందుకంటే నాకు అనుబంధాలు తక్కువ. నేను రెండు మూడేళ్లు ఒకే సంస్థలో పనిచేశానంటే అక్కడ కఠిన నిర్ణయాలే ఉంటాయి. నేను బయట నుంచి వచ్చిన వ్యక్తిలా ఉంటాను. నా నిర్ణయం చెప్పినప్పుడు సంస్థ, యాజమాన్యానికి కఠినంగానే తోచింది. ఇది తప్పో ఒప్పో నాకైతే తెలియదు. మనం మరింత పడిపోవచ్చు కూడా. కానీ కొత్తగా ప్రయత్నిస్తున్నా. ఏదేమైనా అందరం కలిసి నడవాల్సిందే అని చెప్పా. షారుఖ్‌, జుహీ, జే ఇందుకు అంగీకరించారు. నాకు అండగా నిలిచారు. అయితే ఆ నిర్ణయం మాత్రం నాకు కఠినంగా అనిపించలేదు’ అని వెంకీ మైసూర్‌ అన్నారు.