* మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు బెయిల్ అభించింది. ఈ మేరకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. మోకా భాస్కరరావు హత్యకేసులో అరెస్ట్ అయిన కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాజమండ్రి కారాగారంలో ఉన్నారు.
* విశాఖ డాబాగార్డెన్‌లో విషాదం చోటు చేసుకుంది. తుమ్మల రమేష్ కుమార్ అనే వ్యక్తికి కరోనా సోకి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య, ఇద్దరు కుమార్తెలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. వెంటనే స్థానికులు వారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
* ఓ సబ్ ఇన్స్‌పెక్టర్ వ్యవహారం పోలీసు శాఖకు తలవంపులు తెచ్చే విధంగా మారింది. మద్యం కేసులో పట్టుపడ్డ ఓ వ్యక్తి కుటుంబసభ్యులతో పొందూరు ఎస్ఐ రామకృష్ణ మాట్లాడిన ఆడియో టేప్ హల్ చల్ చేస్తోంది. తుంగపేట గ్రామానికి చెందిన అప్పారావు ఇంట్లో 48 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటలు గడిచినా ఎస్ఐ కేసు నమోదు చేయలేదు. నిందితుడు కుమార్తెపై ఎస్ఐ కన్నేశాడు. ఆమె తండ్రిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే చెప్పినట్లు చేయాలన్నాడు. తన ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి రావాలంటూ ఎస్ఐ అడ్రస్ ఇచ్చాడు. అయితే తన తండ్రితో కలిసి స్టేషన్‌కు వస్తానని బాధితురాలు ఎస్ఐకు చెప్పింది. ఇంటికి ఒంటరిగా వస్తేనే కేసు లేకుండా చేస్తానని చెప్పాడు. ఎస్ఐ దుర్బుద్దిని గ్రహించిన బాధితురాలు తెలివిగా రామకృష్ణ బారినుంచి తప్పించుకుంది. ఆమెతో ఎస్ఐ మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. పోలీసులే మహిళలపట్ల ప్రవర్తిస్తున్న తీరుపై విమర్ళలు వెళ్లువెత్తుతున్నాయి.
* లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు– ‘దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు– 1902 నెంబర్‌కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయింపు– గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం– ఎమ్మార్వో, ఎండీఓ, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి– ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్– టెండర్ విలువ రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాల్సిందే– కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుల విషయాల్లో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా స్పష్టం అయ్యింది– అవినీతి నిరో«ధక చర్యలపై సీఎం సమీక్షా సమావేశం.
* సరదాగా జలపాతం వద్దకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. కళ్లెదుటే కుమార్తె కన్నుమూసి తీరని వేదన మిగిల్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. బయ్యారానికి చెందిన అంబటి సతీష్ కుటుంబంతో కలిసి మండలంలోని చింతోనిగుంపు జలపాతానికి వెళ్లారు. ఆయన కుమార్తె పూజిత(18) నీటిలోకి దిగగా.. కుమారుడు శివాజీ ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో పూజిత ఒక్కసారిగా నీటిలో పడిపోవడంతో.. చేయి పట్టుకొని పైకిలాగేందుకు యత్నించిన శివాజీ కూడా జారిపోయాడు. సతీష్.. శివాజీని బయటకు లాగారు. పూజిత కోసం ప్రయత్నించేలోపే జలపాతంలో గల్లంతైంది. పోలీసులు స్థానిక యువకుల సాయంతో గాలించగా.. పూజిత మృతదేహం లభ్యమైంది. క్షణాల్లోనే తమ కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఇంటర్ చదివిన పూజిత వెటర్నరీ కోర్సు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉంది.