నీట్ 2020 పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలను ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరగబోయే.. నీట్ (National Eligibility cum Entrance Test ) 2020 పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలను ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసింది.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://ntaneet.nic.in/లో చూసుకోవచ్చు.
పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను త్వరలో జారీ చేయనున్నారు. పరీక్ష రాసే నగరాలను మార్చుకునేందుకు ఈ దఫా విద్యార్థులకు అయిదు సార్లు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) అవకాశం కల్పించింది.
మొత్తం విద్యార్థుల్లో 99.87 శాతం మంది తమ మొదటి ఛాయిస్‌గా ఎంచుకున్న నగరం/పట్టణంలోనే పరీక్ష రాయనున్నారు.
నీట్ 2020కు పెరిగిన పోటీ: వైద్య విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా సెప్టెంబరు 13న నిర్వహించనున్న నీట్(యూజీ)-2020కు మొత్తం 15,97,433 మంది హాజరుకానున్నారు.
గత ఏడాది 15,51,753 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి మరో 45,680 మంది అధికంగా పోటీ పడనున్నారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా:
పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుండగా.. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరూ గుంపుగా రాకుండా స్లాట్ల విధానం అమలు చేస్తున్నారు.
దీంతో ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
ఎవరు ఏ సమయంలో రావాలో హాల్‌టికెట్లపై ముద్రిస్తారు.
విద్యార్థుల సెల్‌ఫోన్లకు వివరాలను మేసేజ్ రూపంలో పంపిస్తారు.
పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడకుండా గేటు బయట భౌతిక దూరం పాటించేందుకు తాళ్లు కట్టనున్నారు.
వాటి వరుసల మధ్య నుంచే విద్యార్థులు లోపలికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేయనున్నారు.