ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఈ యేటి గణేశ్ ఉత్సవాలను వర్చువల్ పద్ధతిలో సెలబ్రేట్ చేసుకున్నది. సిడ్నీలో ఉన్న ఆ సంఘం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకచవిత వేడుకలను నిర్వహించింది. ఆస్ట్రేలియాలో ఉన్న వందలాది తెలంగాణ కుటుంబీకులు, వారి పిల్లలు జూమ్ ద్వారా కనెక్ట్ అయి వినాయకుడి వేడుకలను నిర్వహించారు. తొలుత గణేశుడి విగ్రహ తయారీ పోటీలో పిల్లలు పాల్గొన్నారు. మట్టితో వినాయకుడిని తయారు చేయడంలో పిల్లలు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అద్భుతమైన గణేశ్ విగ్రహాలను వారు తయారు చేశారు. ఆ తర్వాత పూజారుల సమక్షంలో శాస్త్రోక్తంగా విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, స్లోకాల ఆలాపన, సాంస్కృతిక నృత్యాల్లో పిల్లలు పాల్గొన్నారు. రెండు లడ్డూలను కూడా వేలం వేశారు. పిల్లల లడ్డూ 900 డాలర్లకు, పెద్దల లడ్డూను 1228 డాలర్లకు వేలం వేశారు. వర్చువల్ పద్ధతిలో సాగిన గణేశ్ వేడుకల్లో వందలాది కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ ఈవెంట్‌ను సక్సెస్ చేయడంలో ఏటీఎస్ఏ అధ్యక్షుడు పావని రాగిపాని కీలకపాత్ర పోషించారు. గణేశుడి నిమజ్జనంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు. ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ .. వర్చువల్ పద్ధతిలో వినాయకచవితిని నిర్వహించడం తొలిసారి అని జనరల్ సెక్రటరీ తుమ్మనపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఆస్ట్రేలియాలో వర్చ్యూవల్ వినాయక చవితి
Related tags :