Politics

నిగూఢ నిరాశలో కాంగ్రెస్ పార్టీ

నిగూఢ నిరాశలో కాంగ్రెస్ పార్టీ

పార్టీ అధిష్ఠానానికి సీనియర్‌ నేతలు రాసిన లేఖ సృష్టించిన కలకలం కాంగ్రెస్‌లో ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటంలేదు. సీడబ్లూసీ సమావేశం ముక్తకంఠంతో సోనియా నేతృత్వానికే మద్దతిచ్చిన పరిస్థితుల్లో సంస్థాగతంగా సమూల మార్పులు కోరుతూ లేఖ రాసిన నేతలు మంగళవారం భారీ స్థాయిలో వివరణలు ఇచ్చుకున్నా నర్మగర్భమైన వ్యాఖ్యలూ చేశారు. రాజకీయ సవాళ్లను ఎదుర్కోవటానికి పార్టీకి ప్రస్తుతమున్న సన్నద్ధత సరిపోదని వ్యాఖ్యానించారు. లేఖపై సంతకాలు చేసిన 23 మందిలో అత్యధికులు తాము పార్టీని బలోపేతం చేయాలన్న సదుద్దేశంతోనే లేఖ రాశామని వివరణ ఇచ్చారు. దేశంలో ప్రస్తుతమున్న వాతావరణాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ లేదని వీరప్పమొయిలీ కుండబద్దలు కొట్టారు. ‘‘దేశంలో ఇప్పుడున్న తీవ్ర ధోరణుల నేపథ్యంలో కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పరిస్థితిలో పార్టీలేదన్నది వాస్తవం.’’ అని స్పష్టం చేశారు. ‘‘మా లేఖ సోనియా గాంధీ మనసును నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నా’’ అని మొయిలీ అన్నారు. 2024లో జరిగే లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధంచేయాలన్నదే తమ లేఖ ఉద్దేశమని వివరించారు. సోనియా నాయకత్వం పార్టీకి ఎంతో అవసరమన్నారు. ఆమె త్యాగాలను తాము మరవలేదన్నారు. పార్టీని సంస్థాగతంగా అన్ని స్థాయుల్లో బలోపేతం చేయాలని కోరుతున్నామంటే ప్రస్తుత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాదని స్పష్టం చేశారు. లేఖపై సంతకాలు చేసిన 23 మందిలో ఎవరికీ పార్టీని వీడే ఉద్దేశమే లేదని మొయిలీ స్పష్టం చేశారు. భాజపాలో చేరే ప్రసక్తే లేదన్నారు. అధిష్ఠానానికి రాసిన లేఖ లీక్‌ కావటంపై సమగ్ర విచారణ జరగాలన్నారు. అందుకు కారకులైన వారిని శిక్షించాలని కోరారు.

‘‘మిత్రులారా మేం అసమ్మతివాదులం కాదు. పార్టీ పునరుజ్జీవం కోరుకుంటున్నాం. పార్టీని బలోపేతం చేయాలని చెప్పడానికే తప్ప నాయకత్వాన్ని సవాల్‌ చేయడానికి లేఖ రాయలేదు. చరిత్ర ధైర్యవంతుల్ని గుర్తిస్తుంది తప్పితే పిరికివాళ్లను కాదు’ అని వివేక్‌టంకా చేసిన ట్వీట్‌ను ఆనంద్‌ శర్మ అభినందించారు. పార్టీ ప్రక్షాళన కోరుతూ సోనియాకి రాసిన లేఖపై సంతకాలు చేసిన వారిలో రాజ్యసభ సభ్యులైన వివేక్‌టంకా, ఆనంద్‌శర్మ కూడా ఉన్నారు. రాజ్యాంగ విలువలపై నిరంతరం జరుగుతున్న దాడితో పాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణంపై మా అభిప్రాయాలను లేఖలో పంచుకున్నామని ఆనంద్‌శర్మ అభిప్రాయపడ్డారు. భాజపాను నిలువరించాలన్నదే తమ లక్ష్యమన్నారు. వివేక్‌టంకా ట్వీట్‌ను ముకుల్‌ వాస్నిక్‌ కూడా సమర్థించారు. లేఖ రాయటాన్ని నేరంగా భావిస్తున్న వారు కూడా భవిష్యత్తులో ప్రస్తావిత అంశాల విలువను గుర్తిస్తారు అని ట్వీట్‌ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండగా ట్వీట్‌ చేసి రాహుల్‌గాంధీని ఇబ్బందిపెట్టిన కపిల్‌ సిబల్‌ మంగళవారం మరో ట్వీట్‌ చేసి చర్చకు తెరతీశారు. 2022లో రాజ్యసభ సభ్యుడిగా రిటైర్‌ కాబోతున్న సిబల్‌ భవిష్యత్తులో దాన్ని నిలబెట్టుకోవడానికే లేఖ రాసిన 23మందితో జత కలిశారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన తాజా ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకొంది. ‘‘ఇది పదవి కోసం కాదు.. దేశం కోసం…అదే అన్నింటి కంటే ముఖ్యం’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ అధిష్ఠానంపై బహిరంగంగానే ప్రత్యక్ష దాడి చేస్తున్నారు. సచిన్‌పైలెట్‌ రాజస్థాన్‌లో తిరుగుబాటుచేసినప్పుడు ‘‘పార్టీ గురించి ఆందోళన చెందుతున్నా. అశ్వశాల నుంచి గుర్రాలు కట్లుతెంచుకొని పారిపోయిన తర్వాత మాత్రమే మేల్కొంటున్నాం’’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌ అధిష్ఠానం సామర్థ్యం వైపు వేలెత్తిచూపింది. పార్టీ ప్రక్షాళన కోరుతూ సీనియర్లు రాసిన లేఖతో అత్యవసరంగా నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశం సాధించిన ఫలితాలు ఏమిటనే దానిపై కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా విస్తృత చర్చ జరుగుతోంది. అసంతృప్త నేతలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయగలిగామని కొందరు అంటుంటే…సోనియా, రాహుల్‌కు మద్దతుగా యావత్తు పార్టీ నిలవటం గమనార్హమని కొందరు పేర్కొంటున్నారు. లేఖను మీడియాకు బహిర్గతం చేయటాన్ని అధిష్ఠానం తీవ్రంగానే పరిగణిస్తుందని, వారిపై చర్యలు వెంటనే కాకపోయినా, తర్వాతైనా ఉంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. కుమారి సెల్జా, అంబికా సోనీ సీడబ్ల్యూసీ భేటీలో మాట్లాడుతూ లేఖ రాసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే, వారు కోరినట్లుగా వెంటనే క్రమశిక్షణ చర్యలకు అధిష్ఠానం ఉపక్రమించలేదు. ఆ దిశగా కనీసం స్పందించలేదు. అయితే, నాయకత్వం అండదండలతోనే సెల్జా, సోనీలు లేఖ రాసిన వారిపై ధ్వజమెత్తారని అంటున్నారు. లేఖ రాయటం వెనుక ఉద్దేశాలు మంచివే అయినా దానిని మీడియాకు బహిరంగపరచకుండా ఉండాల్సిందని సీనియర్‌ నేత పీసీ చాకో అన్నారు. సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడినైన తనను సమావేశానికి ఆహ్వానించలేదని తెలిపారు. పార్టీ బాధ్యతలను రాహుల్‌ గాంధీ స్వీకరించాలని ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడుతూ అన్నారు. లేఖ రాయటాన్ని సీడబ్ల్యూసీ సమావేశంలో పలువురు సహచరులు తప్పుపట్టినప్పటికీ పార్టీకి ఉపయోగమైన చర్చ జరిగిందని లేఖపై సంతకం చేసిన మరో నేత వ్యాఖ్యానించారు. సోనియా అనారోగ్యం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రాహులే స్వయంగా మాట్లాడారని, మా లేఖ ఉద్దేశం కూడా ఆయన ఆయా అంశాలపై దృష్టి సారించేలా చేయటమేనని పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న సంకేతం కూడా మంచి పరిణామమేనని పేరు వెల్లడించటానికి ఇష్టపడని నేత ఒకరు చెప్పారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి లేఖ నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర కలకలం సృష్టించటానికి కారణమైన లేఖ వెనుక ఎంపీ శశిథరూర్‌ ఉన్నట్లు సమాచారం. మార్చిలో ఆయన నివాసంలో జరిగిన ఓ విందుకు 40 మంది కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. ఆ సమయంలోనే పార్టీ అధిష్ఠానానికి లేఖ రాయాలన్న ఆలోచనపై చర్చ జరిగింది. శశిథరూరే స్వయంగా లేఖలోని అంశాలను రూపొందించారని, అయితే అందరూ దానిని సమర్థించినప్పటికీ కొందరు మాత్రమే సంతకం చేయటానికి ముందుకొచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత వివిధ దశలు దాటుకుంటూ ఆగస్టు 7న 23 మంది సంతకాలతో సోనియా వద్దకు లేఖ వెళ్లింది.