హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న క్రికెటర్ జాక్ కలిస్‌పై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) ప్రశంసల జల్లు కురిపించింది. కిరీటంలో ఓ ఆభరణంగా అతడిని కొనియాడింది. ఆల్‌టైమ్ ఉత్తమ క్రికెటర్లుగా పేర్కొంటూ పాకిస్థాన్‌కు చెందిన జహీర్ అబ్బాస్, ఆస్ట్రేలియాకు చెందిన మహిళా క్రికెటర్ లీసా స్టాన్‌లేకర్‌తోపాటు కలిస్‌ను ‘హాల్ ఆఫ్ ఫేమ్’గా ఐఐసీ ఇటీవలే గుర్తించింది.
ఈసందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పందిస్తూ ‘కలిస్‌కు సముచిత గౌరవం దక్కింది. అతడి కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఆధునిక క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించిన కలిస్.. గ్యారీ సోబర్స్ సరసన చేరే అర్హత కలిగిన ఆల్‌రౌండర్. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, స్వింగ్ బౌలర్‌గా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు’ అని సీఎస్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుగండ్రి గోవెండెర్ పేర్కొన్నారు ‘అతడి క్రీడాస్ఫూర్తి అనిర్వచనీయం. దేశంలోని ఎందరో యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయుడు. దక్షిణాఫ్రికా క్రికెట్ కిరీటంలో కలిస్ ఓ ఆభరణం. దేశం అతడిని చూసి గర్విస్తోంది’ అని అన్నారు.
గ్రేమ్ పొల్లార్డ్, బేరీ రిచర్డ్స్, అలాన్ డొనాల్డ్ తర్వాత హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడు కలిస్. క్రికెట్ చరిత్రలోనే టెస్టులతోపాటు వన్డేల్లో 10 వేల పరుగులు, 250కి పైగా వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు. 2005లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌తోపాటు, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అతడు ఏకంగా 23 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.