* దేశీయ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆరంభంలో అదరగొట్టిన సూచీలు ఆ తర్వాత తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. చివరకు ఆటో, బ్యాంకింగ్ షేర్ల కోలుకున్నప్పటికీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 44 పాయింట్లు లాభపడి, 38,843 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ అతి తక్కువగా 5 పాయింట్ల లాభంతో 11,472 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 74.32 వద్ద కొనసాగుతోంది.
* స్పెక్ట్రం బకాయిల కేసులో వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టెలికాం కంపెనీలు బకాయిలు చెల్లించడానికి విముఖంగా ఉంటే తాము స్పెక్ట్రం లైసెన్స్‌లు రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయగలమని వ్యాఖ్యానించింది. ఏజీఆర్ ఛార్జీల బకాయిల చెల్లింపు గడువుపై న్యాయస్థానం ఈ కేసులో తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు వొడాఫోన్ ఐడియా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా స్పెక్ట్రం ఆయా కంపెనీలకు ఉండటం వాటి రుణ పరిష్కార ప్రణాళిలను ప్రభావితం చేయనుంది. మరోపక్క రిలయన్స్ కమ్యూనికేషన్స్, వీడియోకాన్, ఎయిర్‌సెల్‌లు మరేమైనా బకాయిలు చెల్లించాల్సి వస్తే అవి జియో, ఎయిర్‌టెల్‌లపై ప్రభావం చూపనుంది. జియోకు స్పెక్ట్రం పంచుకోవడం, వ్యాపారానికి సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో సంబంధాలు ఉన్నాయి.
* ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ల రవాణాకు విద్యుత్ వాహనాలను ఉపయోగించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు క్లైమేట్ గ్రూప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఫ్లిప్‌కార్ట్‌లో వందశాతం విద్యుత్ వాహనాలు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ట్విటర్‌లో వెల్లడించారు.
* రాష్ట్రాల్లో స్థానికంగా విధించే లాక్‌డౌన్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కొవిడ్ నుంచి కోలుకున్నట్లు తేలితే ఉద్దీపనలు తొలగించవచ్చని వెల్లడించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గినట్లు తెలిపింది.
* కరోనావైరస్ ప్రజలనే కాకుండా సంస్థలను కూడా ప్రభావితం చేస్తోంది. దీని వల్ల ప్రజల అలవాట్లు… తద్వారా సంస్థల తీరుతెన్నుల్లో కూడా గణనీయమైన మార్పు చోటుచేసుకుంటోంది. ఈ క్రమంలో.. అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్‌సీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తన నినాదం ‘‘ఫింగర్ లికింగ్ గుడ్’’ను ఉపయోగించడాన్ని ఈ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. కొవిడ్-19 వ్యాప్తిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు ఈ నినాదం సరిపోదని భావించిన సంస్థ యాజమాన్యం.. వ్యక్తిగత శుభ్రతకు, సామాజిక దూరానికి మరింత ప్రాధాన్యతనిచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే దాని స్థానంలో ఏ నినాదాన్ని ఉపయోగించేదీ ఇంకా నిర్ణయించలేదని తెలిపింది. అంతేకాకుండా బిల్‌బోర్డులు, ప్రకటనలు, పదార్థాలను ప్యాక్ చేసేందుకు ఉపయోగించే సంచులు మొదలైన అన్నిటిపై ఆ నినాదం కనిపించకుండా చేసింది.
* జీఎస్‌టీ అమలు అనంతరం ప్రజలు చెల్లించాల్సిన పన్ను రేట్లు దిగివచ్చాయని, పన్నుల నిబంధనలను పాటించే వారి సంఖ్య పెరిగిందని ట్వీట్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘జీఎస్‌టీ అమలుకు ముందు వ్యాట్, ఎక్సైజ్, అమ్మకపు పన్ను.. ఇలా పన్నులకు పన్నులు కలిసి అత్యధికంగా 31 శాతం వరకు చెల్లించాల్సి ఉండేద’ని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జీఎస్‌టీ అమలుకు ముందు పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 65 లక్షలు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపై 1.24 కోట్లకు చేరిందని తెలిపింది. జీఎస్‌టీ అమలయ్యాక చాలా వస్తువుల పన్ను రేట్లు దిగివచ్చాయని తెలిపింది. ప్రస్తుతం విలాసవంత ఉత్పత్తులు, నిషేధ ఆంక్షలు (సిన్) ఉన్న ఉత్పత్తులు మాత్రమే 28 శాతం శ్లాబులో ఉన్నాయని వెల్లడించింది. 28 శాతం శ్లాబులో ఉన్న 230 వస్తువుల్లో దాదాపు 200 ఉత్పత్తులకు తక్కువ పన్ను రేట్ల శ్లాబులోకి మార్చామని వివరించింది. గృహ నిర్మాణ రంగంపై జీఎస్‌టీని 5 శాతానికి పరిమితం చేశామని, అందుబాటు గృహాలకైతే జీఎస్‌టీ 1 శాతమేనని తెలిపింది. జీఎస్‌టీలో ఎలాంటి ప్రక్రియనైనా పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ విధానంలో చేసుకోవచ్చని పేర్కొంది. ఇప్పటివరకు 50 కోట్ల రిటర్న్‌లు ఆన్‌లైన్ ద్వారా దాఖలయ్యాయని, 141 కోట్ల ఇ-వేబిల్లులు తీసుకున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.