Politics

భూములు లాక్కుంటామని కేటీఆర్ హెచ్చరికలు

భూములు లాక్కుంటామని కేటీఆర్ హెచ్చరికలు

తెలంగాణలో పరిశ్రమల కోసం భూములను పొంది వాటిని స్థాపించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఆయా సంస్థలకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకుంటామని చెప్పారు. నిర్ణీత గడువు మేరకు కార్యకలాపాలు ప్రారంభించని సంస్థలకు వెంటనే సంజాయిషీ నోటీసులివ్వాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖపై మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పరిశ్రమలు, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు జయేశ్‌రంజన్‌, రామకృష్ణారావు, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి వాటిని ప్రారంభమయ్యేలా చూడటం ద్వారా ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పెట్టుబడులు సమీకరిస్తున్నాం. ఆయా సంస్థలు కూడా ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు చేపట్టాలని ప్రభుత్వపరంగా కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు భూములు పొంది, వాటిల్లో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టని సంస్థల జాబితాను రూపొందించి వెంటనే నోటీసులిస్తాం. సరైన సమాచారం ఇవ్వని వాటి భూములను తిరిగి తీసుకుంటాం. ఒక రంగం పరిశ్రమలు నెలకొల్పడం కోసం భూములు తీసుకుని, దానికి భిన్నమైన పరిశ్రమ స్థాపన కోసం భూవినియోగ మార్పిడి(ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌) అనుమతి పొంది, నిర్ణీత సమయంలో వాటిని ప్రారంభించని వాటికీ నోటీసులిస్తాం.