Fashion

భారతీయత గుండె చప్పుడు…ఖాదీ

భారతీయత గుండె చప్పుడూ…ఖాదీ

ఖా అంటే తిండి.. దీ అంటే ఇచ్చేది.. పేదవారికి దగ్గర చేయాలని గాంధీజీ భావించిన వస్త్రం.. ఖద్దరుగా పిలిచే ఈ వస్ర్తాలు.. ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయి.. పేదలకు సహాయంగా ఖాదీ వస్త్రం ఓ ఉద్యమంగా ఉంటుందని.. మన దేశ ప్రధాని కూడా స్పష్టం చేశారు.. ఈ వస్ర్తాలు అందంగానే కాకుండా.. ఒక బలమైన భారతీయ గుర్తింపునిస్తాయి.. మిశ్రమ ఖాదీతో ఇప్పుడు ఫ్యాషన్‌ రంగం ప్రయోగాలు చేస్తున్నది.. దీంతో సరికొత్త డిజైన్లు ఇప్పుడు అందరి మనసులను కట్టిపడేస్తున్నాయి..
*ఖాదీ చేతితో నేసిన సహజమైన వస్త్రం. దీన్ని భారతదేశంలో ప్రధానంగా తూర్పు, ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్‌లోని తూర్పు ప్రాంతాల వాళ్లు ఎక్కువగా తయారుచేస్తారు. సాధారణంగా పత్తి నుంచి నేయబడుతుంది. పట్టు లేదా ఉన్నితో కూడా నేస్తారు. ఇవి అన్నీ కూడా ఒక చర్ఖా అనే స్పిన్నింగ్‌ చక్రంలో నూలు దారాలతో తిప్పుతారు. వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ఖాదీని భారతీయ గ్రామాల్లోని ఇళ్ళల్లో చేతితో తయారు చేస్తారు. చక్రాల మీద నూలుని వడుకుతారు. ఈ చక్రాన్ని ‘చర్ఖా‘ అని కూడా అంటారు.
*అంతా చేతితోనే..
మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో ప్రశాంతమైన ఆయుధంగా ఖాదీని 1920లో ప్రారంభించారు. మన దేశంలో పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ రాష్ర్టాల నుంచి మాత్రమే ఉత్తమ స్వచ్ఛమైన కాటన్‌ను ఎంపిక చేసుకొని వాడుతారు. ముందుగా వ్యవసాయం నుంచి వచ్చిన ముడి పత్తిని ఒకేచోట సేకరించి ఉత్పత్తి చేసే స్థలంలో కొనుగోలు చేస్తారు. ఫీల్డ్‌ నుండి తెచ్చిన విత్తన పత్తి మెత్తటి దూది. దీని నుంచి గింజలను వేరు చేయడానికి సమీప జిన్‌లకు తరలిస్తారు. అక్కడ డ్రయ్యర్స్‌ ద్వారా తేమను తొలగిస్తారు. కార్డింగ్‌ ద్వారా కాటన్‌ ఫైబర్లను ఉత్పత్తి చేస్తారు. తయారైన పోగులను ర్యాపింగ్‌ చేసి, డై ద్వారా రంగులద్దుతారు. సహజ రంగుతో కూడిన ప్రత్యేక ద్రావణంలో నానబెడుతారు. ఆ తర్వాత ఖాదీ ముద్రణ జరుగుతుంది. ఇలా ఖాదీ బట్టలు తయారవుతాయి.
*చరిత్ర చెబుతున్నది..
చేతి స్పిన్నింగ్‌, చేతితో నేయడం అనేవి వేలాది సంవత్సరాల నుంచి భారతీయులకు సుపరిచితం. టెర్రకోట స్పిన్లెస్‌ (స్పిన్నింగ్‌ కోసం), ఎముక టూల్స్‌ (నేత కోసం), నేసిన బట్టలు ధరించి ఉన్న పురావస్తు ఆధారాలు, ఇండస్‌ లోయ నాగరికత వాళ్ల వస్ర్తాలను చూస్తే అర్థమవుతుంది. బ్రిటీష్‌ పరిపాలకుల వలన బలవంతంగా ఇండియన్స్‌ ఖరీదైన వస్ర్తాలు కొనవలసి వచ్చింది. బ్రిటీషు వారు ముడి పదార్థాల కోసం ఇంగ్లిష్‌ బట్టలను మిల్లులకు ఎగుమతి చేసేవాళ్లు. ఇండియన్‌ మిల్లు యజమానులు భారతీయ మార్కెట్‌ను గుత్తాధిపత్యం చేయాలనుకున్నారు. ఈ సమయంలోనే మహాత్మా గాంధీ 1920లలో తనంతట తాను స్పిన్నింగ్‌ చేసుకొని ఇతరులను ప్రోత్సహించడం ప్రారంభించారు. ఆయన ఇంకా చక్రి (స్పిన్నింగ్‌ వీల్‌) నేషనలిస్ట్‌ ఉద్యమ చిహ్నంగా తయారుచేశారు. ప్రారంభంలో భారత జెండా దాని కేంద్రంలో అశోక చక్రాన్ని కలిగి ఉండదు. మహాత్మా గాంధీ చేనేతను ప్రోత్సహించడానికి ఒక సంస్థను సృష్టించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు సేకరించారు. దీనిని ‘ఖద్దర్‌’ లేదా ‘ఖాదీ’ ఉద్యమం అని పిలిచారు. గ్రామీణ స్వయం ఉపాధి, స్వయం-విశ్వాసం (బ్రిటన్లో పారిశ్రామికంగా తయారుచేసే వస్త్రం ఉపయోగించి కాకుండా) కోసం ఖాదీ స్పిన్నింగ్‌ ప్రచారాన్ని ప్రారంభించాడు. దీని వలన ఖాదీ స్వదేశీ ఉద్యమానికి చిహ్నం అయ్యింది.
*చౌక కాదు..
ఖాదీ అత్యంత సహజమైన ఫ్యాబ్రిక్‌. భారతీయ వాతావరణ పరిస్థితులకు అనువైనది. ఇది వేసవికాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ప్రధానంగా ఖాదీ పత్తి, ఖాదీ పట్టు, ఉన్ని ఖాదీ అని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. *ఇవికాకుండా.. మాటకా ఖాదీ, టస్సర్‌ ఖాదీ, సిల్క్‌ ఖాదీ, పట్టు ప్రింటెడ్‌ ఖాదీ అని ఉన్నాయి. అంతేకాదు.. పొండూరు ఖాదీ అంటూ మరొక వెరైటీ తయారవుతుంది. ఇటీవలే డిజైనర్‌ ఖాదీ చీరలు, జార్జెట్‌ ఖాదీ చీర భారతీయ ఫ్యాషన్‌ రంగంలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. కాని ఇప్పటికీ, విదేశాలలో స్వచ్ఛమైన ఖాదీ పత్తి ఫ్యాబ్రిక్‌ గిరాకీ మిగిలిన ఖాదీ వస్ర్తాలతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఖాదీ ఉత్పత్తులు మీరు అనుకునేంత నిజంగా చౌకగా లభించదు. ఉదా. రంగు డై ముడి ఖాదీ పట్టు వస్త్రం కంటే ఎక్కువ ధర పలుకుతుంది. సుమారు మీటర్‌ 800 రూపాయలు ఉంటుంది. కివిక్‌ దుకాణాలలో, ఒక చిన్న చర్ఖా కొనుగోలు చేయడానికి రూ. 550 (ముడి ఒక కట్ట), ప్రొసెస్‌ లేని పత్తి రూ. 40లు పలుకుతున్నది. అందువల్లే ఖాదీ వస్ర్తాల ధర ఎక్కువ.
*ఫ్యాషన్‌ ట్రెండ్‌గా..
ఒకప్పుడు కేవలం సంప్రదాయ దుస్తులుగా ధరించినప్పటికీ.. ఇప్పుడు డిజైనర్లు వీటిని ఇండో- వెస్ట్రన్‌ దుస్తులుగా డిజైన్‌ చేస్తున్నారు. కేవలం దుస్తులుగా కాకుండా.. స్లింగ్‌ బ్యాగ్స్‌, అలంకరణలకు కూడా ఖాదీ పట్టు బట్టతో తయారు చేస్తున్నారు. చీరలే కాదు.. దుపట్టా, కుర్తా, స్కర్ట్‌, ప్యాంట్స్‌, లాంగ్‌ గౌన్లు, బ్లేజర్లు ఇలా చాలా రకాలుగా డిజైన్‌ చేసుకోవచ్చు. కేవలం ఆడవాళ్లకే కాదు.. మగవాళ్ల ఫ్యాషన్‌ ప్రపంచంలోనూ ఖాదీది ప్రత్యేక స్థానమనే చెప్పుకోవచ్చు. ఖాదీలో డ్రెస్‌ మెటీరియల్స్‌ కూడా వస్తాయి. కాటన్‌ చీరల మీదకి బీడ్స్‌ వచ్చిన బ్లౌజ్‌లను, పెయింట్‌ వేసిన బ్లౌజ్‌లను వేస్తే బాగుంటుంది. లెదర్‌ బెల్ట్‌తో మరింత లుక్‌ అదిరిపోతుంది. మనసుకు నచ్చినట్టు డిజైన్‌ చేసుకుంటే ైస్టెల్‌గా మెరిసిపోవచ్చు.
*ఫ్యాషన్‌ ప్రపంచంలో..
స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం అఖిల భారత ఖాదీ, గ్రామస్థాయి పరిశ్రమల బోర్డును ఏర్పాటు చేసింది. తర్వాతి కాలంలో 1957లో ఖాదీ, విలేజ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కె వి ఐ సి) గా అవతరించింది. అప్పటి నుండి KVIC భారతదేశంలో ఖాదీ పరిశ్రమ అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తున్నారు. 1989లో.. కెవిక్‌ బొంబాయిలో మొట్టమొదటి ఖాదీ ఫ్యాషన్‌ షోను నిర్వహించారు. 1990లో బ్రిలియంట్‌ డిజైన్‌-వ్యవస్థాపకుడు రిటు బేరి తన మొదటి ఖాదీ సేకరణను ఢిల్లీస్‌ క్రాఫ్ట్‌ మ్యూజియంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ట్రీ ఆఫ్‌ లైఫ్‌ షోలో ప్రదర్శించాడు. ఇప్పుడు కివిక్‌కి సలహాదారుడుగా వ్యవహరిస్తున్నారు.