* వచ్చే రెండు నెలల్లో యాపిల్ ఇంక్ భారత్‌లో ఆన్లైన్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబరు-అక్టోబరులో కంపెనీ ఇక్కడ ఆన్లైన్ స్టోర్ పెట్టవచ్చని ఈ పరిణామాలతో సంబంధమున్న వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా దసరా, దీపావళి పండుగ గిరాకీని అందిపుచ్చుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
* మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ చెల్లింపు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్బీఐ పేరు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దంటూ చురకలంటించింది. ఆరు నెలల మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ, ఆ వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ సుప్రీంలో పిటిషన్ వేశారు. దానిపై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
* సన్‌టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్ , కావేరీ కళానిధి మారన్ భారత్‌లో 2019-20లో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లుగా నిలిచారు. ఈ జంట వార్షిక వేతం రూ.175 కోట్లు. కళానిధి మారన్ 1993లో ఈ కంపెనీని ప్రారంభించారు. ఆయనే ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కళానిధి- కావేరిలు ఏటా చెరో రూ.13.87 కోట్లు వేతనం తీసుకోగా.. రూ.73.63 కోట్లు ఎక్స్‌గ్రేషియాగా పొందుతున్నారు. అంటే ఒక్కొక్కరు రూ.87.50 కోట్లను పొందుతున్నారు. వీరి జీతాలను ఇదే స్థాయిలో స్థిరంగా కొనసాగించాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు.
* వాహన, బ్యాంకింగ్ రంగ షేర్ల అండతో దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నప్పటికీ.. ఇక్కడి సూచీలు సానుకూలంగా కదలాడుతుండడం గమనార్హం. బుధవారం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 61 పాయింట్లు లాభపడి 38,905 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 26 పాయింట్లు ఎగబాకి 11,498 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.25 వద్ద కొనసాగుతోంది.
* ద్విచక్ర వాహనాలనేవి విలాసవంతమైన వస్తువులు కావు.. అలాగని హానికర వస్తువులూ కాదు.. కాబట్టి జీఎస్టీ రేట్ల సవరింపునకు అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మంగళవారం పరిశ్రమ వర్గాలతో జరిగిన చర్చలో ఈ విషయాన్ని తెలిపినట్లు సీఐఐ ఒక ప్రకటనలో తెలిపింది. రేట్ల సవరణ ప్రతిపాదనను జీఎస్టీ మండలి పరిశీలించే అవకాశం ఉందని సీతారామన్ తెలిపినట్లు ఆర్థిక మంత్రి ప్రతినిధి సైతం ఒక ప్రకటన వెలువరచారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై 28 శాతం వాటా ఉంది. 150 సీసీ వరకు ఉన్న బైక్‌లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని.. ఆ తర్వాత దశలవారీగా ఆయా విభాగాలపై జీఎస్టీలో కోత విధించాలని గతేడాది హీరో మోటోకార్ప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
* దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 39 వేలు, నిఫ్టీ 11,500 మార్కును మళ్లీ అందుకున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం 2 గంటల వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 230.04 పాయింట్ల లాభంతో 39,073.92 వద్ద.. నిఫ్టీ 77.30 పాయింట్ల లాభంతో 11,549.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.29గా ఉంది.
* 2020 ద్వితీయార్థంలో జి-20లోని వర్థమాన దేశాల్లో కేవలం భారత్, చైనా, ఇండోనేషియాల్లోనే వాస్తవ జీడీపీ బలంగా నమోదవుతుందని మూడీస్ అంచనా వేస్తోంది. 2021లో అయితే కరోనా ముందు స్థాయిల కంటే అధిక వృద్ధి నమోదుకావొచ్చని తెలిపింది. అదే సమయంలో భారత జీడీపీ 3.1 శాతంగా నమోదు కావొచ్చన్న అంచనాలను అట్టేపెట్టి ఉంచింది. ‘అభివృద్ధి చెందిన దేశాల్లో వర్థమాన దేశాల కంటే ఎక్కువ సవాళ్లు ఉన్నాయి. అక్కడ ఆర్థిక వృద్ధి అంచనాలు బలహీనంగా నమోదుకావొచ్చ’ని తన ఆగస్టు నివేదికలో వెల్లడించింది.