Fashion

నీటి నాట్యాలు

నీటి నాట్యాలు

వర్షం కోసం ఇప్పటికీ గ్రామాల్లో కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. వానొస్తే రైతులకు పండుగే. ఇప్పటిదాకా భరించిన ఎండలకు వాన చినుకులు ఉపశమనం కలుగజేస్తాయి. ఇదంతా ఓకే. వర్షాలు మొదలవగానే ఆ నీటిని ఎలా కాపాడుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు. కొంచెం నిర్లక్ష్యం వహించామో నీరంతా వృథా అవుతుంది. ఈ సమస్యలకు పరిష్కారమే గ్లోబల్ వాటర్ డాన్స్. ఇదేంటి పేరు వింతగా ఉంది అనుకుంటున్నారా…నీటిని ఎలా వాడుకోవాలి. వర్షపు నీటి ఆవశ్యకత, నీటి ఎద్దడి నుంచి బయటపడటం . .ఇలాంటి సమస్యలకు పరిష్కారాన్ని నృత్యం ద్వారా చెప్పడమన్నమాట. ప్రతి ఏడాది జూన్ 15 నుంచి ఇలాంటి కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. “ సంస్కృతి సెంటర్ ఫర్ కల్చర్ ఎక్స్‌లెన్స్‌” అనే సంస్థ గ్లోబల్ వాటర్ డాన్స్‌ను చక్కగా నిర్వహిస్తోంది. నీటి ఎద్దడి, శుభ్రత కలిగిన నీటి ఆవశ్యకత, ఎద్దడి లేకుండా చూసుకోవడంలాంటి విషయాలపై కొరియోగ్రఫీ ద్వారా అవగాహన కల్పిస్తోందీ సంస్థ. ‘పానీ బచావో, జీవన్ బచావో’ అంటూ ట్యాగ్‌లైన్‌తో అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆదిశంకరాచార్యులు గంగా నదికి నివాళిగా గంగా స్తోత్రం చేశారు. గంగానది పరిరక్షణ, ఉపరితలాన్ని శుభ్రపరచడం, జీవవైవిధ్యం, జల జాతుల పునరుద్ధరణ… వీటనింటి కోసం నిర్వహించే సమగ్ర పరిరక్షణ కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఒకేసమయంలో ఒకేసారి నృత్యకారులు నృత్యం చేయడం విశేషం.