చిన్న పిల్లలు మాస్కులు ధరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలు
కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న మార్గాల్లో ముఖానికి మాస్కు ధరించడం కీలకమైనది. మన దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు ముఖానికి మాస్కు లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాత్రం ఐదేళ్లలోపు పిల్లలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ పిల్లలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించలేదు. చిన్న పిల్లల దగ్గర్నుంచి అన్ని వయసుల వారు మాస్కులు ధరిస్తున్నారు. ఈసారి పిల్లలను వారి వయసును బట్టి మూడు గ్రూపులుగా విభజించి కొత్త మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది.
ఐదేళ్లలోపు పిల్లలు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలు మాస్కు ధరించాల్సిన అవసరం లేదు. వీరికి కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిపింది.
6 నుంచి 11 ఏళ్లలోపు వారు:
6 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలు ఉంటున్న ప్రాంతంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటేనే మాస్కులు ధరించాలి. అదీ సురక్షితంగా, తగిన పద్ధతిలో మాస్కును ఉపయోగించగలగాలి. మాస్కును ఎలా ధరించాలో, తీయాలి అనేది పెద్దలు సరైన పర్యవేక్షణ ఉంటేనే మంచిది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. పిల్లలు ఆడుకునే సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు.
అయితే, ఆ సమయంలో భౌతిక
దూరం మాత్రం పాటించాలని సూచించింది. ముఖ్యంగా ఇంట్లో వృద్ధులు అధికంగా ఉంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఇళ్లలో ఉండే 6 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలు మాస్కును ధరించడం తప్పనిసరి.
12 ఏళ్లు అంతకు మించిన వయసువారు:
12 ఏళ్లు అంతకు మించిన వయస్సు వారికి కరోనా ముప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి పెద్దవారిలాగానే వీళ్లు కూడా మాస్కును ధరించాలి. మరీ ముఖ్యంగా ఇతరుల నుంచి కనీసం 3 అడుగుల దూరం పాటించలేని పరిస్థితుల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
అంతేకాకుండా సిస్టిక్ ఫైబ్రోసిస్, కేన్సర్ వంటి జబ్బులతో బాధపడే పిల్లలు మాస్కులు ధరించాలని.. డౌన్స్ సిండ్రోమ్ వంటి సమస్యలతో బాధపడే వారికి తప్పనిసరి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న నిబంధనను తీసుకువచ్చారు. అయితే ఇప్పటికీ మాస్కు ధరించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ముఖానికి మాస్కు పెట్టుకున్నా సరైన పద్దతులు పాటించడం లేదు. ఈ నేపథ్యంలో మాస్కు ధరించడం ఎలా? వాటిని ఎలా శుభ్రపరచాలి? మాస్కు పారవేస్తున్నపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుని ఉండాలి. అప్పుడే వారు ఈ వైరస్ బారినుంచి తమను తాము రక్షించుకోవడంతోపాటు ఇతరులకు సోకకుండా మంచి చేసిన వారు అవుతారు.
అసలు మాస్క్ ఎందుకు ధరించాలి?
కోవిడ్-19 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినపుడు గానీ, దగ్గినపుడు గానీ ద్రవరూపంలో ఉండే తుంపర్లు గాలి ద్వారా ఎదుటివారి మీద పడే అవకాశం ఉంటుంది. మరికొందరి శ్వాసకోస వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కోవిడ్-19కి కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్ ఏరోసోల్స్ (తుంపర్లు)లో మూడు గంటల వరకు ఉంటాయని గుర్తించారు. అదే మనం మాస్కు ధరిస్తే వైరస్ మన శ్వాసవ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది.
ఎలాంటి మాస్కులను ఉపయోగించాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం.. ప్రజలు మెడికల్ లేదా క్లాత్ మాస్క్ ఏదైనా ఉపయోగించవచ్చు. అయితే మెడికల్ మాస్కులను హెల్త్ వర్కర్లు, కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారు మాత్రమే వాడాలని, క్లాత్ మాస్కులను కోవిడ్-19 లక్షణాలు లేనివారు వాడాలని సూచించింది. ఒకవేళ మెడికల్ మాస్కులు వాడినా ఒక్కసారి మాత్రమే ఉపయోగించి పారవేయాలని, క్లాత్ తో తయారు చేసుకున్న మాస్కులు ఎన్నిసార్లైనా వాడవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది. మనం తయారు చేసుకునే క్లాత్ మాస్కు కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పొరలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆ మాస్కు వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంటుంది.
మాస్కులు ధరించే విధానం:
* మాస్కు ధరించినపుడు ముక్కు, నోరు, గడ్డం మూసి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
* మాస్కు బిగుతుగాను లేక మరీ వదులుగా ఉండకూడదు. ఊపిరి పీల్చుకోడానికి వీలుగా ఉండాలి.
* మాస్కు బయట భాగాన్ని వీలైనంత వరకు చేతులతో ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక దానికి వైరస్ ఉంటే అది మీ చేతులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది.