* దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.39 సమయంలో సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 39,259 వద్ద నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,596 వద్ద కొనసాగుతున్నాయి. గాడ్‌ఫ్రేఫిలిప్స్, టీసీఎన్‌సీ క్లోతింగ్, డిష్‌టీవీ ఇండియా, సన్‌టెక్ రియాల్టీ, ఒబెరాయ్ రియాల్టీ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫిన్, జీసీఐ హౌసింగ్, మిన్డా ఇండస్ట్రీస్, అరవింద్ ఫ్యాషన్స్ వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
* ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టిక్‌టాక్‌పై వ్యతిరేకత పెరిగిపోవడంతో సీఈవో కెవిన్ మాయర్ రాజీనామా చేశారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి టిక్‌టాక్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కెవిన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. ‘‘ఇటీవల కాలంలో రాజకీయ వాతావరణం వేగంగా మారిపోయింది. ప్రపంచస్థాయిలో వ్యాపారానికి అవసరమైన మార్పులను కార్పొరేట్ వ్యవస్థలో చేశాను. నేను వైదొలగుతున్నాను’’ అని ఉద్యోగులకు పంపిన లేఖలో కెవిన్ పేర్కొన్నట్లు ఆంగ్ల పత్రిక సీఎన్‌ఎన్ పేర్కొంది.
* కరోనావైరస్ ప్రభావంతో ఇప్పటికే చాలా ఉపకరణాలు మనుషుల ప్రమేయం లేకుండా కృత్రిమ మేధతో పనిచేసే విధంగా రూపొందుతున్నాయి. తాజాగా ఆ కోవలోనే ప్రముఖ తాగునీటి శుద్ధి ఉపకరణాల సంస్థ ‘కెంట్’ కూడా మరో సరికొత్త ఉత్పత్తితో ముందుకొచ్చింది. కేవలం ముఖ గుర్తింపుతో ‘టచ్‌లెస్ ఫేస్ అటెండెన్స్ సిస్టం’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత సంవత్సరం ‘కెంట్ క్యామ్ ఐ’ పేరుతో తీసుకొచ్చిన పరికరానికి అదనపు హంగులతో ‘కెంట్ క్యామ్ అటెండెన్స్’ పేరుతో ఈ అత్యాధునిక హాజరు నమోదుచేసే పరికరాన్ని విడుదల చేస్తున్నట్లు కెంట్ యాజమాన్యం ప్రకటించింది.
* ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఉద్దేశం గూగుల్‌కు లేదని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. టిక్‌టాక్ సెప్టెంబర్ 15లోగా అమెరికాలో కార్యకలాపాలను మూసివేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, మైక్రోసాఫ్ట్, ట్విటర్ తదితర అమెరికా సంస్థలు దానిని చేజిక్కించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
* క్యాబ్ సర్వీసులు అందించే ఉబర్ భారత్‌లో కొత్తగా ‘అద్దెకు ఆటో’ సేవలను ప్రారంభించింది. ఈ ఆప్షన్ ద్వారా ఆటోను కొన్ని గంటల పాటు ప్రయాణికులు అద్దెకు తీసుకోవచ్చు. గతంలో ఇలా కార్లు అద్దెకు తీసుకునే ఆప్షన్ ఉండేది. అద్దెకు తీసుకున్న ఆటోలను ఇష్టమైనన్ని సార్లు, ఇష్టమైన చోట నిలుపుకునే సౌలభ్యం ఉబర్ కల్పిస్తోంది. దీనికి సంస్థ అదనపు రుసుము వసూలు చేయదు. ఆటోను సాధారణంగా బుక్ చేసుకున్నాక.. ఎక్కడైనా నిర్ణీయ సమయానికి మించి నిలుపుదల చేస్తే, అదనపు ఛార్జి వసూలు చేస్తారనే విషయం తెలిసిందే. గతంలో బెంగళూరులో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘అద్దెకు ఆటో’ ప్రాజెక్టును ప్రస్తుతం బెంగళూరు సహా హైదరాబాద్, దిల్లీ ఎన్‌సీఆర్, ముంబయి, చెన్నై, పుణె నగరాల్లో ప్రారంభిస్తున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్రాల సంయుక్త రుణాలు రికార్డు స్థాయికి చేరొచ్చని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ఒకటి అంచనా వేస్తోంది. జీడీపీలో 91 శాతానికి చేరొచ్చని..1980 నుంచి చూసినా ఇదే అత్యధిక స్థాయి అని చెబుతోంది. 2019-20లో ప్రబుత్వ రుణాలకు, జీడీపీకి మధ్య నిష్పత్తి 75 శాతంగా నిలిచినట్లు ఆ నివేదిక చెబుతోంది. 2029-30 కల్లా ఈ రుణ నిష్పత్తి 80 శాతానికి చేరొచ్చని.. అయితే వృద్ధిని త్యాగం చేయకుండా..2039-40 నాటికి కూడా ప్రభుత్వ లక్ష్యమైన 60 శాతానికి చేరకపోవచ్చని అంచనా కడుతోంది. 1999-2000లో ప్రభుత్వ రుణం జీడీపీలో 66.4 శాతంగా ఉంది. అప్పటి నుంచి పెరుగుతూ వచ్చి 2019-20 నాటికి 75 శాతానికి చేరిందని వివరించింది. ప్రభుత్వ రుణాలు పెరిగితే.. గత కొద్ది వ్యయాలుగా చేపడుతున్న వ్యయాలను కొనసాగించే సామర్థ్యం పరిమితం కావొచ్చని అది అంచనా కట్టింది.