* జిల్లాలో అన్ని బ్యాంకులు సెప్టెంబరు ఒకటో తేదీ నుండి యధావిధిగా తమ పనివేళలతో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ చెప్పారు . స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ -19 నేపథ్యంలో కొంత మంది బ్యాంక్ సిబ్బంది కోవిడ్ బారిన పడిన సందర్భంలో బ్యాంకర్ల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 31 వరకు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 1 వరకు వ్యాపార లావాదేవిలకు , ఉ . 10 నుండి మ . 2 వరకు బ్యాంకు పనివేళలుగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు . అయితే సెప్టెంబరు ఒకటో తేదీనుండి యధావిధిగా తమ పనివేళలతో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నారు . జిల్లాలో కరోనా కేసుల నమోదు ఉధృతి తగ్గుముఖం పట్టిందన్నారు . దేశవ్యాప్తంగా పాజిటివ్ రేటు 9 శాతం , రాష్ట్రంలో సుమారు 10 శాతం ఉండగా జిల్లాలో 4 శాతం మాత్రమే ఉందన్నారు .
* భారత్‌లో నిషేధానికి గురై తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల్ని మైక్రోసాఫ్ట్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నామని వాల్‌మార్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్‌తో చేసుకోనున్న ఈ ఒప్పందం తమ అడ్వర్టైజింగ్ వ్యాపారాన్ని మరింత విస్తృతపరిచేందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలు టిక్‌టాక్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. వాల్‌మార్ట్ ప్రకటనపై ఇటు మైక్రోసాఫ్ట్ కానీ, టిక్‌టాక్ కానీ స్పందించలేదు. టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాల్‌మార్ట్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
* ప్రిఫరెన్షియల్, ఇతర పద్ధతుల్లో తన ప్రొమోటర్ జైడస్ ఫ్యామిలీ ట్రస్ట్‌కు షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 1,099.98 కోట్ల నిధుల సేకరణకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎఫ్ఎంసీజీ సంస్థ జైడస్ వెల్నెస్ గురువారం వెల్లడించింది. ఒక్కోటీ రూ. 1,643.10 వంతున 21,30,000 షేర్లను ఇవ్వడం ద్వారా రూ. 349.98 కోట్లను సమకూర్చుకోవడానికి.. అలాగే ఈక్విటీ షేర్లు సహా కంపెనీ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 750 కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదానికి గాను సెప్టెంబరు 19వ తేదీన కంపెనీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించడానికీ బోర్డు నిర్ణయించింది. 2020 జూన్ 30తో ముగిసే త్రైమాసికానికి జైడస్ వెల్నెస్లో జైడస్ ఫ్యామిలీ ట్రస్ట్ వాటా 4.29 శాతంగా ఉంది.
* స్వీడిష్ ఫర్నిచర్ సంస్థ ఐకియా అన్ని రకాల ఉత్పత్తులపై ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. వినియోగదారులకు మరింత చేరువ కావాలనే దీర్ఘకాలిక వ్యూహంలో ఇది భాగమని తెలిపింది. కుర్చీలు, బొమ్మలు, పరుపులు, పుస్తకాల అరలు, సోఫాలు తరితర అన్ని రకాల ఉత్పత్తులపై ఈ ధరల తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్ విక్రయ కేంద్రంతోపాటు, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయని తెలిపింది. నాణ్యతా పరంగా ఎలాంటి రాజీ పడకుండా, ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ధరలను నిర్ణయించినట్లు ఐకియా ఇండియా కంట్రీ కమర్షియల్ మేనేజర్ కవితారావు తెలిపారు.
* చమురు ధరలు మళ్లీ పెరిగాయి. చమురు సంస్థలు గడచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధరను పెంచాయి. శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 11 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ రూ.81.94 కి చేరింది. 13 రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై రూ.1.51 పైసలు పెంచాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దిల్లీలో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.73.56పైసలుగా ఉంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్యాంక్‌షేర్ల అండతో సెన్సెక్స్, నిఫ్టీ ఆరు నెలల గరిష్ఠానికి చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 తర్వాత స్టాక్‌మార్కెట్లు ఈ మార్కును అందుకోవడం ఇదే తొలిసారి. ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి షేర్లు రాణించడంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పటికీ బలంగా, స్థిరంగా ఉందంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు ఇందుకు దోహదపడ్డాయి.