NRI-NRT

అంతర్జాతీయ విమానాల్లో వేడి భోజనం

అంతర్జాతీయ విమానాల్లో వేడి భోజనం

కరోనా మహమ్మారి కారణంగా కట్టుదిట్టమైన నిబంధనలతో విమానాల రాకపోకలకు తిరిగి అనుమతించిన కేంద్రం.. తాజాగా వాటిలో భోజన సౌకర్యం కల్పించడానికి అంగీకరించింది. అలాగే ముఖానికి మాస్క్‌ ధరించడానికి నిరాకరించేవారి విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. వారిని విమానయాన సంస్థలు నో ఫ్లై జాబితాలో చేర్చవచ్చంటూ గురువారం అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. మే 25న విమాన సేవలు పునఃప్రారంభమైన తరుణంలో దేశీయ విమానాల్లో భోజన సదుపాయాలకు అనుమతివ్వలేదు. అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ముందుగానే ప్యాక్‌ చేసిన కోల్డ్‌ మీల్‌, స్నాక్స్‌ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. కాగా, తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ నిబంధనలకు సడలింపులు ఇచ్చింది.

విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం..

* ప్రయాణ సమయం ఆధారంగా దేశీయ విమానాల్లో ముందుగా ప్యాక్‌ చేసిన స్నాక్స్, పానీయాలు, భోజనం అందించొచ్చు.

* నిబంధనల ప్రకారం అంతర్జాతీయ విమానాల్లో వేడి భోజనం, పరిమితంగా పానీయాలు ఏర్పాటు చేయొచ్చు.

* ఆ సమయంలో వాడే ట్రేలు, ప్లేట్లు, స్పూన్లు వంటి వాటిని ఒకసారి మాత్రమే వినియోగించాలి.

* ముఖానికి మాస్క్‌ ధరించడానికి నిరాకరించిన వ్యక్తులను సంస్థలు నో ఫ్లై జాబితాలో చేర్చడానికి అనుమతి.

* అంతర్గతంగా చర్చించుకున్న తరవాత విమానంలో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని ‘నోఫ్లై జాబితా’లో చేర్చవచ్చు. ఇతర సంస్థలు సదరు ప్రయాణికుడి విషయంలో అదే నిర్ణయం తీసుకోవచ్చు.

కరోనా కారణంగా విధించిన ఆంక్షలను రెండు నెలల తరవాత సడలించడంతో మే 25 నుంచి దేశీయ విమానాలు తిరిగి రాకపోకలు సాగిస్తున్నాయి. కొవిడ్ ముందుతో పోల్చుకుంటే కేవలం 45 శాతం విమానాలు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.