* దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు భారీ షాక్ ఇవ్వనుంది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటుకు సిద్దమవుతోంది. తద్వారా ఎన్‌పీసీఐ గుత్తాధిపత్యానికి చెక్ చెప్పాలని భావిస్తోంది. అంతేకాదు ఇందులో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా భాగస్వామ్యం చేయనుందని తాజా సమాచారం.
* జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజమైన ఫోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లో తన వాటాను రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించనుంది. తద్వారా దేశీయ కార్ల మార్కెట్లో క్రియాశీలకమైన పాత్ర పోషించే అవకాశం వస్తుందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టెఫెన్ నాప్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో ఇతర వ్యాపారాల మాదిరిగా ఆటోమొబైల్ మార్కెట్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొనాల్సి వచ్చిందని వివరించారు. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
* పాలసీల క్లెయింలను సులువుగా పరిష్కరించే విషయంలో బీమా సంస్థలు చొరవ చూపాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ సూచించారు. మొత్తం ప్రక్రియను సులువుగా, ఎలాంటి కష్టం లేకుండా పూర్తి చేసేందుకు వీలుండాలని తెలిపారు. కొవిడ్-19 తర్వాత ప్రపంచం కొత్తగా మారబోతోందని, ఈ సందర్భంగా వచ్చిన అవకాశాలను బీమా సంస్థలు ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వం సులభతర వ్యాపార నిర్వహణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోందని, బీమా సంస్థలూ క్లెయింల పరిష్కారంలో దీన్ని పాటించాలన్నారు. ‘ఫిన్‌కాన్ 2020’ సదస్సులో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల్లో బీమా రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, జన- ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష యోజనలాంటివి ఉదాహరణలని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వచ్చిన కరోనా పాలసీలు, ఆరోగ్య సంజీవనిలాంటివీ ప్రజలకు ఉపయోగపడేవేనన్నారు. బీమా రంగంలో మరిన్ని ఉద్యోగాలు, వినూత్న పథకాలను తీసుకొచ్చేందుకు పరిశ్రమతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని వెల్లడించారు.
* ఇప్పటి వరకు హైఎండ్ మోడల్స్‌ను మాత్రమే విడుదల చేస్తూ వస్తున్న ‘వన్‌ప్లస్’ చూపు మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్లపై పడిందనిపిస్తోంది. త్వరలోనే వీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీని ధర కూడా రూ.10వేల లోపు ఉండొచ్చని టెక్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే నార్డ్ సిరీస్‌లో ‘వన్‌ప్లస్ నార్డ్ లైట్’ తీసుకొచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. దాని ధర ఎంత ఉంటుందనేది సంస్థ ఇంకా వెల్లడించలేదు. అలాగే స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో బడ్జెట్ వన్‌ప్లస్ ఫోన్ బేస్ మోడల్‌ను రూ.9,999కే అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
* ఆదాయ పన్ను(ఐటీ) విభాగం తమ పరిశీలనలో ఉండే మదింపుదార్లకు ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ విషయంపై త్వరలో సమాచారాన్ని పంపనున్నట్లు ఒక పన్ను అధికారి తెలిపారు. ‘అంతక్రితం నోటీసులు ఏమీ పక్కకు వెళ్లవు. ముందుగా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ పథకం కింద మదింపు చేసే వారికి సమాచారం పంపిస్తాం. ఒక వేళ మదింపు అధికారి మరింత సమాచారం కావాలని భావిస్తే సెక్షన్ 142(1) కింద తాజా నోటీసులు పంపిస్తార’ని సీబీడీటీ అదనపు కమిషనర్ జైశ్రీ శర్మ పేర్కొన్నారు. రీఅసెస్‌మెంట్ కేసులు కూడా ఇక ఫేస్‌లెస్ పథకంలో భాగంగా మారనున్నాయని శుక్రవారమిక్కడ జరిగిన వెబినార్ కార్యక్రమంలో భాగంగా స్పష్టం చేశారు. ఈ పథకంలో భాగంగా మదింపుదార్లకు, పన్ను అధికార్లకు మధ్య భౌతికంగా ఎటువంటి సంబంధాలు ఉండవు. అన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరుగుతాయి.
* మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ సోమవారం మరోసారి స్టాక్ బ్రోకర్ల సంఘం, డిపాజిటరీలు, క్లియరింగ్ కార్పొరేషన్లతో సమావేశం నిర్వహించనుంది. మార్జిన్ తనఖాపై తీసుకొచ్చిన కొత్త నిబంధనలను సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చే విషయంలో ఎంత మేర సిద్ధంగా ఉన్నారన్నదాన్ని విశ్లేషించేందు కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతిపాదిత వ్యవస్థను తీసుకురావడానికి సాంకేతికంగా బ్రోకర్లు ఇంకా సిద్ధం కాలేదని.. మరో నెల పొడిగింపును కోరే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలల్లో ఇప్పటికే సెబీ రెండు సార్లు వీరితో సమావేశం నిర్వహించగా.. ఇది మూడో సారి కానుంది.