Sports

హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి నేడు

హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి నేడు

హాకీ లెజెండ్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ 155వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. హాకీలో ఆయన చేరుకున్న శిఖరాలను ఈ సందర్భంగా కొనియాడారు. ‘జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని దిగ్గజం‌ ధ్యాన్‌చంద్‌కు నివాళి అర్పిస్తున్నా. హాకీ స్టిక్‌తో ఆయన చేసిన మాయాజాలం చిరస్మరణీయం. దేశ క్రీడాకారుల విజయానికి దోహద పడిన వారి కుటుంబాలకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన రోజు’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘దేశం గర్వించేలా అనేక పతకాలు సాధించిన మన క్రీడాకారులకు ఈ రోజు అంకితం’ అని అన్నారు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామాన్ని వారి జీవితంలో భాగం చేసుకోవాల్సిందిగా దేశ ప్రజలను మోదీ ఈ సందర్భంగా కోరారు. ధ్యాన్‌చంద్‌ 1905లో జన్మించారు. భారత హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో ఘనతలు సాధించారు. ఆయన జట్టు సభ్యుడిగా ఉన్న 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో భారత్‌ వరుస స్వర్ణాలను గెలుచుకుంది. ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకొంటాం. ఈసందర్భంగానే భారత ప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలు అందిస్తోంది. క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నతోపాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ పురస్కారాలు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు పలువురు టీమ్‌ఇండియా క్రికెటర్లు కూడా క్రీడా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ట్వీట్లు చేసి ఆటపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

*** ఎవరేమన్నారు..

* ఆటలాడటం అంటే కేవలం ఎంటర్‌టెయిన్మెంట్‌ మాత్రమే కాదు, అవి మనల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేస్తాయి. మనతో పాటు పక్కనున్న వారిని కూడా రోజూ ఎంతో కొంత సమయం ఆడేందుకు ప్రోత్సహించాలి. దాంతో ఈ భారత దేశం మరింత ఆరోగ్యంగా, శక్తిమంతంగా మారుతుంది. -సచిన్‌ తెందూల్కర్‌

* భారత రత్న మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా నివాళులు. భారత రత్న అయిన ఒక దిగ్గజం మరో భారత రత్న పురస్కారాన్ని అందుకోవడం ప్రత్యేకమైన సందర్భం. -వీరేంద్ర సెహ్వాగ్‌

* నేనెక్కడికి వెళ్లినా నాకిష్టమైన ఆట ఆడేందుకు సిద్ధంగా ఉంటా. ఈ జాతీయ క్రీడా దినోత్సవం మనం మరిన్ని క్రీడలు ఆడేలా ప్రోత్సహించాలి. అది మనకు ఆనందాన్ని మిగల్చాలి. -రోహిత్‌శర్మ

* క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ సేవల్ని గుర్తు చేసుకుంటున్నా. అలాగే ఈ ఆట నాకు మిగిల్చిన అనుభూతులను కూడా. ఈ దేశానికి ఎప్పటికీ రుణపడి ఉంటా. -శిఖర్‌ధావన్‌

* నేనెంతో ఇష్టపడే దేశం తరఫున అంతే ఇష్టపడే క్రికెట్‌ ఆడటం.. గొప్ప అవకాశంగా భావిస్తున్నా. అందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడినే. -శ్రేయస్‌ అయ్యర్‌